కాకినాడ, ఫిబ్రవరి 28(నేటి తెలుగు పత్రిక ): కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణాసంచా తయారీ కేంద్రంలోని ఘోర అగ్నిప్రమాదంలో 18 మంది కార్మికులు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్నారు.విజయనగరం పర్యటనలో ఉన్న సీఎం, అక్కడి నుంచే ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యల పురోగతిపై ఆరా తీశారు. ప్రమాదానికి గల కారణాలు, గాయపడిన వారికి అందుతున్న వైద్యసాయం, రెస్క్యూ ఆపరేషన్లపై సమీక్ష నిర్వహించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఘటనా స్థలానికి మంత్రుల రాక
ప్రమాదం జరిగిన సూర్య ఫైర్ వర్క్స్‌లో 20 మందికిపైగా కార్మికులు పని చేస్తున్న సమయంలో పేలుడు సంభవించినట్టు అధికారులు తెలిపారు. పెద్ద సంఖ్యలో కార్మికులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోవడంపై సీఎం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు.
మంత్రి అచ్చెన్నాయుడు స్పందన
ఘటనపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారికి అత్యవసర వైద్యసాయం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఘటనకు కారణాలపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మంత్రి నారాయణ ఆదేశాలు
మంత్రి పి నారాయణ కూడా ఘటనపై స్పందించారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి వైద్య సాయం, రెస్క్యూ చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ దిగ్భ్రాంతి
అలాగే పీవీఎన్ మాధవ్ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ ఘోర ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదానికి గల అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
