అమరావతి,మార్చి 6(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, ఆర్థిక పరిస్థితులు మరియు భవిష్యత్ ప్రణాళికలపై విస్తృతంగా మాట్లాడారు. గత పాలనలో జరిగిన ఆర్థిక అవ్యవస్థల వల్ల రాష్ట్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారని విమర్శించారు. ఎమ్మార్వో కార్యాలయాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సర్క్యూట్ హౌస్‌ల వంటి ఆస్తులను కూడా తాకట్టు పెట్టారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇప్పటికే రూ.43,298 కోట్ల విలువైన అప్పులను రీషెడ్యూల్ చేయించి సుమారు రూ.328 కోట్ల వరకు ఆదా సాధించామని తెలిపారు. భవిష్యత్తులో మరో రూ.1 లక్ష కోట్ల వరకు అప్పులను రీషెడ్యూల్ చేసే చర్యలు కూడా చేపడతామని వెల్లడించారు.
పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి వచ్చే ఏడాది జూన్ నాటికి జాతికి అంకితం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని సీఎం చెప్పారు. గత పాలనలో ఒక వ్యక్తి స్వార్థం వల్ల ఈ ప్రాజెక్టుకు నష్టం జరిగిందని విమర్శించారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణ పనులు కేంద్ర సహకారంతో మళ్లీ వేగం పుంజుకున్నాయని, మరో మూడేళ్లలో రాజధాని పూర్తి రూపు దిద్దుకుంటుందని పేర్కొన్నారు. వచ్చే శాసనసభ సమావేశాల నాటికి ఎమ్మెల్యేలు, మంత్రులు రాజధానిలోని క్వార్టర్లలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
రాష్ట్రంలో నీటి భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ జల ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని సీఎం తెలిపారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు రూ.3,850 కోట్లు మంజూరు చేసి కుప్పం వరకు నీటిని తీసుకెళ్లామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలోని రిజర్వాయర్లలో 628 టీఎంసీల నీరు నిల్వ ఉందని, సమర్థమైన నీటి నిర్వహణ వల్లే ఇది సాధ్యమైందన్నారు. భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరిగాయని తెలిపారు.
అదేవిధంగా ప్రజలపై భారం పడకుండా కరెంట్ ఛార్జీలు పెంచలేదని, గతంలో వచ్చిన ట్రూ-అప్ భారాన్ని కూడా తగ్గించామని సీఎం వెల్లడించారు. పీఎం సూర్యఘర్ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచితంగా సౌర ప్యానెల్లు ఏర్పాటు చేసే కార్యక్రమం చేపట్టామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 2047 స్వర్ణాంధ్ర విజన్‌ను రూపొందించామని, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
