అమరావతి,mar 07, నేటి తెలుగు పత్రిక: ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చన్నాయుడు తెలిపారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ రైతులకు ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ, పంటల బీమా, ప్రత్యేక సహాయ చర్యలు చేపడుతోందని వివరించారు.మంత్రి మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వ్యవసాయ అధికారులు ఫీల్డ్ స్థాయిలో వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికలు సిద్ధం చేస్తున్నారని చెప్పారు. అర్హులైన రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం త్వరితగతిన నష్టపరిహారం అందిస్తున్నామని తెలిపారు.
ఇన్‌పుట్ సబ్సిడీ పెంపు
రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తోందని మంత్రి పేర్కొన్నారు. గతంలో పత్తి, వేరుశెనగ, వరి, చెరుకు పంటలకు హెక్టారుకు రూ.12 వేల వరకు సబ్సిడీ ఇచ్చేవారని తెలిపారు. తరువాత ఎన్.చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఈ మొత్తాన్ని హెక్టారుకు రూ.17 వేలకు పెంచిందన్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ మొత్తాన్ని హెక్టారుకు రూ.25 వేల వరకు పెంచిందని వివరించారు.బుడమేరు వరదల అనంతరం వారం రోజుల్లోనే పంట నష్టం సర్వే పూర్తి చేసి సుమారు రూ.370 కోట్ల నష్టపరిహారం రైతులకు అందించామని మంత్రి తెలిపారు. రైతులతో పాటు కౌలు రైతులకు కూడా నష్టపరిహారం అందించిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని చెప్పారు.
పంటల భీమాపై వివరణ
పంటల భీమా వ్యవస్థలో గత ప్రభుత్వ విధానాల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పంటల భీమా పథకంలో రాష్ట్రం మళ్లీ భాగస్వామ్యమైందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంబంధిత శాఖలతో కలిసి సబ్ కమిటీ ఏర్పాటు చేసి పంటల భీమా పథకాన్ని తిరిగి అమలు చేస్తున్నట్లు తెలిపారు.
అరకు కాఫీ తోటల్లో వ్యాధి నియంత్రణ
అరకు ప్రాంతంలోని కాఫీ తోటల్లో ‘కాఫీ బెర్రీ బోరర్’ అనే పురుగు వ్యాధి పరిమిత స్థాయిలో మాత్రమే కనిపించిందని మంత్రి తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో సుమారు 1.03 లక్షల హెక్టార్లలో కాఫీ సాగు జరుగుతుండగా, కేవలం కొద్ది ప్రాంతాల్లో మాత్రమే ఈ సమస్య గుర్తించబడిందన్నారు.వ్యాధి కనిపించిన వెంటనే అధికారులు, శాస్త్రవేత్తలు, కాఫీ బోర్డు ప్రతినిధులతో కలిసి చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రభావిత ప్రాంతాల్లో కాఫీ కాయలను తొలగించి గుంతలు తవ్వి పాతిపెట్టడం వంటి చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ సమస్య వల్ల నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీగా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించిందని మంత్రి వెల్లడించారు.
అరకు కాఫీ బ్రాండ్ ప్రతిష్టకు ఎలాంటి నష్టం కలగకుండా ప్రభుత్వం అప్రమత్తంగా చర్యలు తీసుకుంటుందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
