Breaking News

ఇరిగేషన్ ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష.. నాణ్యతలో రాజీ లేదు

అమరావతి,mar 07, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంలో నాణ్యతపై ఎలాంటి రాజీ ఉండకూడదని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజాభద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. అమరావతిలో అసెంబ్లీలోని తన ఛాంబర్లో ఇరిగేషన్ శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమావేశంలో మంత్రి నిమ్మల రామా నాయుడుతో పాటు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో పోలవరం ప్రాజెక్టు, వెలిగొండ ప్రాజెక్టు, హంద్రీ నీవా సుజల స్రవంతి, పోలవరం–నల్లమల సాగర్ లింక్, చింతలపూడి లిఫ్ట్, వరికిపూడిశెల లిఫ్ట్, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు. అలాగే వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన పునరావాస పనులపై కూడా చర్చించారు. సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు సంవత్సరాలుగా ఎన్నికల హామీలుగానే మిగిలిపోతున్నాయని తెలిపారు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండకూడదని, ప్రజల అవసరాలను తీర్చేలా ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పోలవరం సహా రాయలసీమ, పల్నాడు, ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రాజెక్టులను క్రమపద్ధతిలో పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు చెప్పారు.

తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు 9 నుండి ఎయిర్ ఫోర్స్ ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ

పోలవరం పనులపై ప్రత్యేక దృష్టి

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కొనసాగించాలని సీఎం ఆదేశించారు. ప్రతి అంశంపై కేంద్రానికి నిరంతరం అప్‌డేట్స్ ఇవ్వాలని సూచించారు. ప్రమాణాలు, నాణ్యత, సాంకేతిక అంశాల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు.డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని, 41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన నిర్మాణాలు, పునరావాస పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు మేఘాద్రిగడ్డ వరకు పూర్తి చేయాలని, రైట్ మెయిన్ కెనాల్‌లో మిగిలిన పనులను కూడా ఈ సీజన్‌లో పూర్తిచేయాలని సూచించారు.

ఇతర ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలి

వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కావడానికి సుమారు రూ.2041 కోట్లు అవసరమవుతాయని అధికారులు తెలిపారు. నిర్మాణ పనులతో పాటు పునరావాసంపై కూడా దృష్టి పెట్టాలని సీఎం సూచించారు.హంద్రీ–నీవా ప్రాజెక్టు ఫేజ్-1 కాల్వ విస్తరణ పనులు 92 శాతం పూర్తయ్యాయని, కుప్పం–పుంగనూరు కాల్వలు 85 శాతం పూర్తయ్యాయని అధికారులు వివరించారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

16న పొట్టి శ్రీరాముల విగ్రహావిష్కరణ

ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు ప్రాధాన్యం

ఉత్తరాంధ్రలో పెండింగ్‌లో ఉన్న చిన్న ప్రాజెక్టులను కూడా ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని సీఎం సూచించారు. వంశధార–నాగావళి, తోటపల్లి బ్యారేజ్, తారకరామ, మహేంద్రతనయ ఆఫ్‌షోర్, హీరమండలం, మద్దువలస, ఝంఝావతి, నాగావళి–చంపావతి లింక్ వంటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని చెప్పారు.ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం నిధుల కొరత లేకుండా చూసుకోవాలని, ఈ మేరకు ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకుని విడతల వారీగా నిధుల విడుదలకు రూట్‌మ్యాప్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *