సూర్యాపేట,mar 07, నేటి తెలుగు పత్రిక: ఇరాన్ పై అమెరికా సామ్రాజ్యవాదం, ఇజ్రాయిల్ దాడి చేసి వందలాది మంది సాధారణ పౌరులను హత మార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నదని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాల బావి సెంటర్ లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వెంటనే దాడులను ఆపేయాలని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దేశాలు అంతర్జాతీయ న్యాయ సూత్రాలను, ఇరాన్ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించి దాడి చేయడం హేయమైన చర్యని, అంతర్జాతీయ సమాజం ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండించాలని పిలుపునిచ్చారు. అమెరికా సామ్రాజ్యవాద ఆగడాలకు అడ్డు, అదుపు లేకుండా పోతుందని గత నెలలోనే వెనిజులా అధ్యక్షుడు మధురోని కిడ్నాప్ చేసి న్యూయార్క్ లో నిర్బంధించిందని, ఇప్పుడు ఇరాన్ సుప్రీం లీడర్ గా ఉన్న ఆయతుల్లా ఖమేనిని బాంబు దాడులతో హతమార్చిందని అన్నారు. గతంలో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ను, లెబనాన్ అధ్యక్షుడు గడాఫీని ఇదేవిధంగా హత్య చేసిన సంఘటనలను ఆయన గుర్తు చేశారు. ఖనిజాలు, సహజ వనరులపై, ఆయిల్ నిల్వలపై కన్నేసిన అమెరికా, ఇరాన్ ను ఎలాగైనా తన దారిలోకి తెచ్చుకొని అక్కడున్న ఆయిల్ నిల్వలను కొల్లగొట్టాలనే దురుద్దేశంతోటే ఇజ్రాయిల్ తో కలిసి దాడులకు పాల్పడిందని అన్నారు. ఇజ్రాయిల్, అమెరికా కలిసి పాలస్తీనాను స్మశానంగా మార్చాయని, ఇప్పుడు ఇరాన్ పై గురిపెట్టేయాని విమర్శించారు. తమ స్వార్ధ ప్రయోజనాల కోసం యుద్ధాలు చేసి సాధారణ ప్రజలను హతమార్చడం అన్యాయం అన్నారు.
ఎంతో కాలంగా భారతదేశానికి మిత్ర దేశంగా కొనసాగుతున్న ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దాడి చేసిన భారత ప్రభుత్వం నోరు మెదపకుండా ఉండడం అన్యాయమని అన్నారు. అమెరికాకు భయపడి నరేంద్ర మోడీ నోరు మూసుకొని ఉంటున్నాడని, యుద్ధం వల్ల పశ్చిమాసియాలో పని చేస్తున్న కోటి మంది భారతీయులకు ఉపాధి పోయే అవకాశం ఉందని, దిగుమతులపై పెద్ద ఎత్తున ధరలు పెరిగి భారత ప్రజలపై భారం పడే అవకాశం ఉందని, అందుకే యుద్ధాన్ని నివారించడానికి భారత ప్రభుత్వం మాట్లాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజాస్వామిక విలువలకి తిలోదకాలు ఇచ్చి అమెరికన్ సామ్రాజ్యవాదం ఏ దేశం పైనైనా దాడి చేసే హక్కు తనకు ఉందనే పేరుతో దేశాలపై ఈ రకంగా దాడులు చేస్తూ వాటి సార్వభౌమత్వాన్ని దెబ్బతీస్తూ, వారి స్వేచ్ఛని హరిస్తున్నది. ఆయా దేశాల్లోని వనరులని దోపిడీ చేస్తున్నది. ఒక స్వతంత్ర దేశంగా భారతదేశం అమెరికా సామ్రాజ్యవాద దురాహంకారాన్ని ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.భారత ప్రభుత్వం వెంటనే స్పందించి అమెరికా, ఇజ్రాయిల్ దుర్మార్గాన్ని ఖండించాలి. ప్రజాస్వామ్య దేశాలతో కలిసి యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నెమ్మది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ములకలపల్లి రాములు, మట్టిపల్లి సైదులు, కోట గోపి జిల్లా కమిటీ సభ్యులు వేల్పుల వెంకన్న, జె.నరసింహారావు, ధనియాకుల శ్రీకాంత్, దండ వెంకటరెడ్డి, నాయకులు షేక్ జహంగీర్, బొమ్మిడి లక్ష్మినారాయణ, చిన్న పంగి నరసయ్య,నల్ల మేకల అంజయ్య, మేరెడ్డి కృష్ణారెడ్డి, అవిరే అప్పయ్య, శ్రీకాంత్, చిత్రం భద్రమ్మ, మీరా తదితరులు పాల్గొన్నారు.

