Breaking News

రైతుల సంక్షేమమే కూట‌మి ప్రభుత్వ లక్ష్యం

  • రైతులకు ఎటువంటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికతో ప్రభుత్వం చర్యలు
  • గత ప్రభుత్వ కాలంలో పెండింగ్‌లో ఉన్న పరిహారాలను కూట‌మి ప్రభుత్వం విడుద‌ల చేసింది
  • యూరియా సరఫరా, ఆర్థిక సహాయంలో ప్రభుత్వం ముందంజ
  • ఇన్‌పుట్ సబ్సిడీ పెంపు, పంటల బీమా సంస్కరణలు
  • రైతులకు మద్దతు ధర అమలు…ధరల స్థిరీకరణకు ప్రభుత్వం కట్టుబాటు
  • వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది… రైతు సంక్షేమంలో రాజీ లేదు : మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి, మార్చి 10,నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకు మద్దతు ధర దక్కడం లేదంటూ వైసీపీ నేతలు ముసలికన్నీరు కారుస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగ‌ళ‌వారం విజ‌యవాడ క్యాంప్ కార్యాల‌యం నుండి ఓ ప్ర‌కట‌న విడుద‌ల చేశారు. రైతుల సమస్యల విషయంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుండి పనిచేస్తోందని మంత్రి స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే రైతులు అప్పులపాలై తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారని ఆయన విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా నిలుస్తోందని చెప్పారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతులకు సకాలంలో అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఎరువుల సరఫరా పూర్తిగా పారదర్శకంగా జరుగుతోందని పేర్కొన్నారు. అయినప్పటికీ వైసీపీ నేతలు కావాలనే ప్రభుత్వంపై బురద చల్లడమే తమ ప్రధాన పనిగా పెట్టుకున్నారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని ఆయన వివరించారు. రైతులకు ఉచిత పంటల భీమా అందిస్తున్నామని, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కూడా అందించామని చెప్పారు. రైతు సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం ఎప్పటికీ రాజీపడదని, అన్నదాతల అభ్యున్నతే తమ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. అలాగే తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని సాక్షి పత్రికను ఆయన హెచ్చరించారు.

రాష్ట్రంలో యూరియా సరఫరా సమర్థవంతంగా

రాష్ట్రంలో రైతులకు అవసరమైన యూరియా ఎరువుల సరఫరాను ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహిస్తోందని మంత్రి తెలిపారు. ఖరీఫ్ 2025 సీజన్‌కు అవసరమైన 6.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు ముందుగానే ప్రణాళిక రూపొందించి 8.70 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఇందులో 7.50 లక్షల మెట్రిక్ టన్నుల అమ్మకాలు జరిగాయని, సుమారు లక్ష మెట్రిక్ టన్నుల నిల్వతో ఖరీఫ్ సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు. రబీ 2025–26 సీజన్‌కు కేంద్ర ప్రభుత్వం 9.38 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించిందని చెప్పారు. ఫలితంగా ఇప్పటివరకు 10.20 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రంలో అందుబాటులో ఉంచి ఫిబ్రవరి నెలాఖరుకే రైతుల అవసరాలను పూర్తిగా తీర్చామని తెలిపారు. గత రబీతో పోల్చితే వరి, మొక్కజొన్న సాగు సుమారు 5 లక్షల హెక్టార్లలో పెరిగినా ఎక్కడా యూరియా కొరత తలెత్తలేదని తెలిపారు. అదేవిధంగా ఎరువుల బఫర్ స్టాక్ నిర్వహణకు ప్రతి సంవత్సరం కేటాయించే రూ.40 కోట్లకు అదనంగా 2025–26 సంవత్సరానికి మరో రూ.45 కోట్లు కేటాయించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 8,489 రైతు సేవా కేంద్రాల నిర్వహణకు 2026–27 సంవత్సరానికి రూ.15.67 కోట్లు కేటాయించామని చెప్పారు. ప్రస్తుతం సుమారు 70 శాతం యూరియాను రైతు సేవా కేంద్రాల ద్వారానే రైతులకు సరఫరా చేస్తున్నామని మంత్రి వివరించారు.

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ ద్వారా రైతులకు అధిక ఆర్థిక సహాయం

రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సూపర్ సిక్స్ లో భాగంగా అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి రూ.20,000 ఆర్థిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ కాలంలో రైతు భరోసా పేరుతో రాష్ట్రం రూ.13,500 ఇస్తామని ప్రకటించినప్పటికీ రాష్ట్రం నుంచి కేవలం రూ.7,500 మాత్రమే ఇచ్చి, కేంద్రం ఇచ్చిన రూ.6,000ను కలిపి మొత్తం రాష్ట్రం ఇచ్చినట్లుగా ప్రకటించారని ఆయన విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం కింద అర్హత కలిగిన వెబ్‌ల్యాండ్ భూ యజమానులు, అటవీ భూమి సాగుదారులకు సంవత్సరానికి రూ.20,000 మూడు విడతలుగా అందిస్తున్నామని తెలిపారు. ఇందులో రాష్ట్రం నుంచి రూ.14,000, కేంద్రం నుంచి పీఎం కిసాన్ ద్వారా రూ.6,000 అందుతున్నాయని చెప్పారు. భూమిలేని సాగుదారులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్ నుంచి సంవత్సరానికి రూ.20,000 ఆర్థిక సహాయం రెండు విడతలుగా అందిస్తున్నట్లు తెలిపారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం అమలుకు రూ.6,300 కోట్లు కేటాయించామని, ఇప్పటికే రెండు విడతలుగా మొత్తం రూ.6,309.44 కోట్లు రైతు కుటుంబాలకు పంపిణీ చేశామని మంత్రి వివరించారు.

ముంబయిలో మంత్రి కందుల దుర్గేష్ పిలుపు.. ఏపీ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టండి

పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ

పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. వరి పంటకు ఇన్‌పుట్ సబ్సిడీని రూ.17,000 నుంచి రూ.25,000కు పెంచామని చెప్పారు. జూన్ 2024 నుంచి ఇప్పటివరకు సుమారు 2 లక్షల మంది రైతులకు రూ.310 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీగా అందించామని వెల్లడించారు. గత ప్రభుత్వ కాలంలో ఆత్మహత్యలు చేసుకున్న 81 మంది రైతుల కుటుంబాలకు చెల్లించకుండా మిగిలిపోయిన రూ.5.67 కోట్ల నష్టపరిహారాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. అదేవిధంగా మరో 214 మంది రైతుల కుటుంబాలకు రూ.14.98 కోట్ల నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఉద్యానవన పంటలు ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు కూడా రూ.50 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీగా అందించామని చెప్పారు. అదేవిధంగా గతంలో సాంకేతిక కారణాలతో మిగిలిపోయిన 1.21 లక్షల మంది రైతులకు రూ.147.34 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదలకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి వెల్లడించారు. అరకు ప్రాంతంలోని కాఫీ తోటల్లో కాఫీ బెర్రీ బోరర్ వ్యాధి వ‌ల‌న‌ నష్టపోయిన 81 మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీగా రూ.7,23,825 ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పారు.

పంటల బీమా పథకంలో సంస్కరణలు

రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పంటల బీమా పథకాన్ని ప్రభుత్వం సమగ్రంగా పునఃసమీక్షించిందని మంత్రి తెలిపారు. వ్యవసాయ, రెవెన్యూ, పౌర సరఫరాల మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసి పథకం అమలుపై విశ్లేషణ చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఖరీఫ్ 2024 సీజన్‌కు ఈ-క్రాప్ నమోదు ఆధారంగా ఉచిత పంటల బీమా అమలు చేశామని తెలిపారు. అనంతరం రైతు కూడా బాధ్యతాయుత భాగస్వామిగా ఉండేలా రబీ 2024–25 నుంచి స్వచ్ఛంద నమోదు విధానాన్ని ప్రవేశపెట్టామని చెప్పారు. గత ప్రభుత్వ కాలంలో బీమా ప్రీమియంలు చెల్లించకపోవడంతో మూడు సీజన్లకు సంబంధించిన రూ.1,990.06 కోట్ల ఆర్థికభారం ప్రస్తుత ప్రభుత్వంపై పడిందని ఆయన వెల్లడించారు. అయినప్పటికీ రైతులకు నష్టం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రస్తుతం అమలు చేస్తున్న ఖరీఫ్ 2024, రబీ 2024–25, ఖరీఫ్ 2025 సీజన్లకు సంబంధించిన బీమా క్లెయిమ్‌ల పరిష్కారం కొనసాగుతోందని చెప్పారు. రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి పంటల బీమా పథకం అమలుకు రూ.250 కోట్లు ప్రతిపాదించినట్లు మంత్రి తెలిపారు.

ధరల స్థిరీకరణకు ప్రభుత్వ కట్టుబాటు

పాలలో కల్తీని గుర్తించండి. ఇలా..!..అనుసరించాల్సిన పద్ధతులపై ప్రజల్లో అవగాహన

వ్యవసాయ పంటలకు కనీస మద్దతు ధర (MSP) అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. ధరల స్థిరీకరణ నిధి (PSF) కింద రైతులకు మార్కెట్‌లో ధరలు తగ్గినప్పుడు వెంటనే ఆదుకునేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 2025–26 సంవత్సరానికి ప్రభుత్వం రూ.300 కోట్లు బడ్జెట్‌లో కేటాయించినప్పటికీ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే సుమారు రూ.588 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు మంత్రి వెల్లడించారు. పోగాకు పంటకు రూ.240 కోట్లు, మామిడి పంటకు రూ.190 కోట్లు, ఉల్లి కొనుగోలుకు రూ.17.20 కోట్లు, ఉల్లి నష్టపరిహారంగా రూ.128.33 కోట్లు, కోకో పంటకు రూ.12 కోట్లు వెచ్చించి రైతులకు మద్దతు అందించామని తెలిపారు. మిర్చి ధరలు పతనమైన సందర్భంలో రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చంద్ర‌బాబు చేసిన ప్రయత్నాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ (MIS) కింద ఒక క్వింటాకు రూ.11,781.25 MIP ధర నిర్ణయించిందన్నారు. గతంలో 2017లో మిర్చి ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వం సుమారు రూ.130 కోట్లు వెచ్చించి 55 వేల మంది రైతులకు క్వింటాకు రూ.1500 చొప్పున చెల్లించిందని మంత్రి తెలిపారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో 2020లో మార్కెట్ ధర రూ.12,000 ఉన్నప్పటికీ కేవలం రూ.7,000 మద్దతు ధర ప్రకటించి అమలు చేయడానికి నిధులు కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. 2019–24 మధ్య రూ.2,140 కోట్ల బడ్జెట్ కేటాయించి కేవలం రూ.1,475 కోట్లు మాత్రమే ఖర్చు చేసి రూ.7,700 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రచారం చేశారని మంత్రి విమర్శించారు.

కడప, కర్నూలు జిల్లాల్లో ఉల్లి రైతుల నుంచి ఉల్లి కొనుగోలుకు రూ.17.56 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. అలాగే ఉల్లి పంట నష్టపరిహారాన్ని హెక్టారుకు రూ.25 వేల నుంచి రూ.50 వేలకు పెంచి రైతులకు రూ.128.33 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వం క్వింటాకు రూ.770 MSP ప్రకటించి కేవలం 129 మంది రైతుల నుంచి 972 మెట్రిక్ టన్నుల ఉల్లి మాత్రమే కొనుగోలు చేసి బాధ్యత తప్పించుకుందని మంత్రి విమర్శించారు. 2024–25లో కొబ్బరికి గత పది సంవత్సరాల్లో అల్‌టైం రికార్డు ధర లభించడంతో రైతులు లాభపడ్డారని తెలిపారు. 2019–24 మధ్య వైసీపీ ప్రభుత్వ కాలంలో రైతులు ధాన్యం అమ్మిన తర్వాత డబ్బుల కోసం 54 రోజుల వరకు వేచి చూడాల్సి వచ్చేదన్నారు. 2023–24 రబీ సీజన్‌కు సంబంధించిన రూ.1,674 కోట్లు రైతులకు చెల్లించకుండా మిగిలిపోయాయని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ బకాయిలన్నీ చెల్లించిందన్నారు. 2024–25 ఖరీఫ్, రబీ సీజన్లలో మొత్తం రూ.13,858 కోట్లు ధాన్యం కొనుగోలు సొమ్మును రైతులకు చెల్లించామని చెప్పారు. 2025–26 సీజన్‌లో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. 11-02-2026 నాటికి 7,31,957 మంది రైతుల ఖాతాల్లో రూ.10,571 కోట్లు జమ చేశామని చెప్పారు. ఇందులో 55 శాతం చెల్లింపులు 8 గంటల్లోపు, 38 శాతం 8 నుంచి 24 గంటల్లో జమ చేశామని తెలిపారు. గత 20 నెలల్లో ఏ పంట ధర తగ్గినా రైతులు నష్టపోకూడదనే లక్ష్యంతో ధరల స్థిరీకరణ నిధి ద్వారా రూ.588 కోట్లు ఖర్చు చేసి సుమారు లక్ష మంది రైతులను ఆదుకున్నామని మంత్రి తెలిపారు. 2026–27 సంవత్సరానికి ధరల స్థిరీకరణ నిధి కింద రూ.500 కోట్లు కేటాయించామని, అవసరమైతే ఇంకా నిధులు వెచ్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అదేవిధంగా 2026–27 సంవత్సరానికి మార్కెటింగ్ శాఖకు రూ.515.39 కోట్ల బడ్జెట్ ప్రతిపాదించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *