Breaking News

పక్కాగా పాసుపుస్తకాలతో రైతుల భూములకు భద్రత: సీఎం చంద్రబాబు

క్యూఆర్ కోడ్, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో భూ రికార్డుల రక్షణ

నంద్యాల,మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని భూ సమస్యలను పూర్తిగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పని చేస్తున్నదని తెలిపారు. ట్యాంపర్ చేయలేని విధంగా క్యూఆర్ కోడ్, రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నామని వెల్లడించారు.నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తబురుజు గ్రామంలో నిర్వహించిన “మీ భూమి–మీ హక్కు” కార్యక్రమంలో సీఎం పాల్గొని రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడం, వారి ఆదాయాలు పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు.

భూ రికార్డులకు టెక్నాలజీ రక్షణ

భూ రికార్డులు ఎవరూ తారుమారు చేయలేని విధంగా కొత్త వ్యవస్థ తీసుకొచ్చామని సీఎం చెప్పారు. క్యూఆర్ కోడ్‌తో పాటు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల రికార్డుల్లో మార్పులు జరిగితే వెంటనే గుర్తించవచ్చని వివరించారు. తహసీల్దార్‌లు, వీఆర్వోలు తప్పు చేసినా దాచిపెట్టలేరని హెచ్చరించారు.గత ప్రభుత్వంలో సర్వే ప్రక్రియలో అనేక తప్పులు జరిగాయని, దాదాపు 19.93 లక్షల పట్టాదారు పుస్తకాలు తప్పులతో జారీ అయ్యాయని తెలిపారు. ఇప్పుడు వాటిని సరిచేసి రైతుల సమక్షంలో భూములు కొలిచి కొత్త పుస్తకాలు అందిస్తున్నామని చెప్పారు.

రెండు పెళ్లిళ్లు.. బ్యాంకు ఉద్యోగాల పేరుతో కోట్ల మోసం.. చివరికి అరెస్ట్

రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరు

రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరు అందించాలన్నదే తన సంకల్పమని సీఎం స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేసి ఇక్కడి ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్‌కు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.ఈ ప్రాంతానికి కీలకమైన హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ సహా పలు సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తున్నామని తెలిపారు. హంద్రీ–నీవా ద్వారా డోన్ నియోజకవర్గంలో ఇప్పటికే అనేక చెరువులకు నీరు అందుతున్నదని చెప్పారు.

రైతుల ఆదాయం పెంపు లక్ష్యం

రైతులకు ఆదాయం పెంచే చర్యల్లో భాగంగా మామిడి పండ్లకు పేపర్ కవర్లు పెట్టే విధానాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈ కవర్లకు 50 శాతం సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. దీంతో పండ్ల నాణ్యత పెరిగి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి ధర వస్తోందని వివరించారు.

అక్రమాలపై కఠిన చర్యలు

రైతుల భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. అవసరమైతే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామని తెలిపారు.

మహిళా ద్రోహి జగన్: మంత్రి సవిత తీవ్ర విమర్శలు

గత ప్రభుత్వంపై విమర్శలు

గత ప్రభుత్వంలో భూకబ్జాలు, అవినీతి ఎక్కువయ్యాయని సీఎం విమర్శించారు. అలాగే కల్తీ మద్యం ఘటనలు, భూ దోపిడీ వంటి వ్యవహారాలను తమ ప్రభుత్వం ప్రక్షాళన చేస్తోందన్నారు.అభివృద్ధి వైకుంఠపాళి ఆటలా మారకూడదని, ప్రజలు మంచి చెడులను గమనించి నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *