ఢిల్లీ,మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): దేశంలో తొలి పూర్తి స్థాయి ‘రింగ్ మెట్రో’ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో ప్రారంభించారు. రెండు కొత్త మెట్రో కారిడార్లను ప్రారంభించడంతో పాటు మరో మూడు కారిడార్లకు శంకుస్థాపన చేశారు.ఢిల్లీ మెట్రో లో భాగంగా కొత్తగా నిర్మించిన సుమారు 12.3 కిలోమీటర్ల మజ్లిస్ పార్క్–బాబర్‌పూర్ కారిడార్‌ను ఇప్పటికే పనిచేస్తున్న మజ్లిస్ పార్క్–శివ్ విహార్ ఢిల్లీ మెట్రో పింక్ లైన్ తో కలిపారు. ఈ మార్గంలో మొత్తం ఎనిమిది ఎలివేటెడ్ స్టేషన్లు నిర్మించారు.ఈ కొత్త లైన్ ప్రారంభంతో పింక్ లైన్ మొత్తం పొడవు 71 కిలోమీటర్లకు చేరి దేశంలోనే తొలి పూర్తిస్థాయి ‘రింగ్ మెట్రో’గా నిలిచింది. ఈ మార్గంలో యమునా నది పై మెట్రో ట్రాక్‌తో పాటు వాహనాల కోసం ఫ్లైఓవర్ కలిపి భారీ ఎత్తైన బ్రిడ్జిని నిర్మించారు.అదే సమయంలో దీపాలి చౌక్ నుంచి మజ్లిస్ పార్క్ వరకు 9.9 కిలోమీటర్ల మేర మరో మెట్రో లైన్‌ను నిర్మించారు. ఈ మార్గంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాక్ సుమారు 28 మీటర్ల ఎత్తులో ఉండటం విశేషం.
మూడు కొత్త కారిడార్లకు శంకుస్థాపన
మెట్రో ఫేజ్–5(ఏ) విస్తరణలో భాగంగా మూడు కొత్త కారిడార్లకు కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు.
- రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్ నుంచి ఇంద్రప్రస్థ వరకు 9 కిలోమీటర్ల అండర్‌గ్రౌండ్ లైన్‌ను సెంట్రల్ విస్టా కారిడార్గా నిర్మించనున్నారు.
- గోల్డెన్ లైన్ విస్తరణలో భాగంగా ఏరోసిటీ నుంచి టెర్మినల్–1 వరకు 2 కిలోమీటర్ల అండర్‌గ్రౌండ్ లైన్ నిర్మించనున్నారు.
- తుగ్లకాబాద్ నుంచి కాలింది కుంజ్ వరకు 3.9 కిలోమీటర్ల ఎలివేటెడ్ లైన్ కూడా నిర్మించనున్నారు.
ఈ కొత్త మార్గాల ద్వారా Noida నుంచి సౌత్ ఢిల్లీ మరియు విమానాశ్రయానికి ప్రయాణం మరింత సులభం కానుంది. దీంతో ఢిల్లీ నగరంలో రవాణా వ్యవస్థకు కొత్త దశ ప్రారంభమైందని అధికారులు తెలిపారు.
