మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): నిరుద్యోగులకు బ్యాంకు ఉద్యోగాలు ఇప్పిస్తానని, తక్కువ ధరకు స్థలాలు కొనిపెడతానని నమ్మబలికి కోట్ల రూపాయలు మోసం చేసిన అంతరాష్ట్ర నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో వెలుగుచూసింది.పోలీసుల వివరాల ప్రకారం, గొల్ల బెనర్జీ అలియాస్ హర్షవర్ధన్ రెడ్డి (33) అనే వ్యక్తి పలు ప్రాంతాల్లో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడ్డాడు. అతను నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం ఓవ్వేరు గ్రామానికి చెందినవాడు.
రెండు పెళ్లిళ్లు.. నకిలీ హోదాలు
ఇంటర్ వరకు చదివిన అనంతరం సీఏ కోర్సులో చేరి మధ్యలోనే మానేసిన బెనర్జీకి అకౌంట్స్‌పై కొంత పరిజ్ఞానం ఉంది. మొదట నెల్లూరులో సురేఖ అనే మహిళను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలు కలిగిన తరువాత ఆమెను విడిచిపెట్టాడు. తరువాత శ్రీకాకుళం జిల్లా లోని గార మండలం సతివాడ గ్రామానికి చెందిన నాగమణిని రెండోసారి వివాహం చేసుకున్నాడు.
అరసవెల్లిలో నివసిస్తూ తాను ఢిల్లీలో సెంట్రల్ జోనల్ ఆడిట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నానని, ఇటీవల విశాఖపట్నం కు ట్రాన్స్‌ఫర్ అయ్యానని చెప్పి పరిచయాలు పెంచుకున్నాడు. అలాగే పలు బ్యాంకుల రిక్రూట్మెంట్ బోర్డులో మెంబర్‌నని చెప్పి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు.
ఉద్యోగాల పేరుతో లక్షలు వసూలు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో పీఓలు, క్లర్క్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఒక్కో ఉద్యోగానికి రూ.6 లక్షలు డిపాజిట్ కడితే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పలువురి నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఈ విధంగా సుమారు రూ.36 లక్షలు తీసుకుని నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.అంతేకాకుండా శ్రీకాకుళంలో తక్కువ ధరకు స్థలం ఇప్పిస్తానని చెప్పి ఒక వ్యక్తి నుంచి రూ.86 లక్షలు తీసుకున్నాడు. అలాగే రూ.29 లక్షల విలువైన గోల్డ్ క్రాఫ్ట్ మెషీన్‌ను రూ.14 లక్షలకు ఇప్పిస్తానని చెప్పి కూడా డబ్బులు తీసుకుని మోసం చేశాడు.
పలుచోట్ల కేసులు
ఈ మోసాలు బయటపడటంతో నిందితుడు విశాఖపట్నం, తిరుపతి, చిత్తూరు ప్రాంతాలకు వెళ్లి అక్కడ కూడా నిరుద్యోగులను మోసం చేసినట్లు విచారణలో తేలింది. అతనిపై నెల్లూరు, తాడేపల్లిగూడెం, తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లలో పలు చీటింగ్ కేసులు నమోదై ఉన్నాయి.
చివరికి పోలీసులకు చిక్కిన నిందితుడు
బాధితుడు దేశెట్టి రమణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చివరికి మార్చి 10న నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
