Breaking News

చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రైతులకు రూ.2,670 కోట్లు.. ‘పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ’ మూడో విడత విడుదల

మార్చి 14(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం మరోసారి ఆర్థిక అండగా నిలిచింది. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో జరిగిన కార్యక్రమంలో ‘పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ’ పథకం మూడో విడత నిధులను విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని 46.85 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి రూ.2,670 కోట్లు నేరుగా జమయ్యాయి. కార్యక్రమాన్ని రైతులతో కలిసి వర్చువల్‌గా వీక్షించిన సీఎం, కేంద్రం తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని కూడా వినిపించారు.

రైతులకు ఏటా రూ.20 వేల సహాయం

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు.
కేంద్రం అందించే రూ.6 వేలకుతోడు రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలును కలిపి ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల సాయం అందిస్తున్నామని చెప్పారు.ఈ విడతలో రాష్ట్ర వాటాగా రూ.1,874 కోట్లు విడుదల చేశామని, 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మూడు విడతల్లో కలిపి రూ.8,985 కోట్లు రైతులకు జమ చేశామని వివరించారు.

సూరంపల్లిలో రైతుతో ముఖాముఖి.. పంటల పరిస్థితి తెలుసుకున్న చంద్రబాబు

ఆధునిక వ్యవసాయానికి ప్రోత్సాహం

వ్యవసాయాన్ని ఆధునిక సాంకేతికతతో ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. డ్రోన్ల ద్వారా విత్తనాలు చల్లడం, డ్రిప్ ఇరిగేషన్ వంటి పద్ధతులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. అలాగే రైతులకు ఆధునిక వ్యవసాయ సలహాలు అందించేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

పోలవరం, అగ్రిటెక్ ప్రాజెక్టులు

రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, వచ్చే గోదావరి పుష్కరాల నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి దేశానికి అంకితం చేస్తామని సీఎం చెప్పారు. అదేవిధంగా ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

ఏపీ టెన్త్ విద్యార్థులకు ఊరట.. ‘నిమిషం నిబంధన’ సడలింపు

ధార్మిక సంస్థలపై వ్యాఖ్యలు

ఈ సందర్భంగా తిరుమలలోని తిరుమల వెంకటేశ్వర ఆలయం లడ్డూ ప్రసాదం కల్తీ అంశాన్ని ప్రస్తావించిన సీఎం, ధార్మిక సంస్థల పవిత్రత విషయంలో రాజీ ఉండదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మంత్రి కింజరపు అచ్చన్నాయుడు, ఎంపీ బాలశౌరి వల్లభనేని, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *