మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో పేదలకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా గుడిసెల్లో నివసిస్తున్న పేదలను గుర్తించి వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలో ప్రత్యేక సర్వే చేపట్టనుంది. ఈ సర్వే మార్చి నాలుగో వారం నుంచి ప్రారంభం కానుంది.
ప్రభుత్వ అధికారులు గ్రామాలు, పట్టణాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి గుడిసెల్లో నివసిస్తున్నవారిని గుర్తించనున్నారు. ముఖ్యంగా పూరి గుడిసెల్లో లేదా టార్పాలిన్‌లతో తాత్కాలికంగా ఇళ్లు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్న పేదలను గుర్తించి వారి వివరాలను నమోదు చేయనున్నారు. అనంతరం అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గుడిసెలు లేని తెలంగాణగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది.ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టింది. 99 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో పేదలను గుర్తించి వారికి గృహ వసతి కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని నాలుగు విడతలుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. అలాగే ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఉక్కు, ఇటుకలు వంటి సామగ్రిని తక్కువ ధరకే అందించేలా మహిళా సంఘాల ద్వారా సహాయం అందించనున్నారు. అదేవిధంగా ప్రత్యేక ఇసుక బజార్లను ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను అందుబాటులో ఉంచనున్నారు.ఇప్పటికే తొలి విడతలో సుమారు 3.24 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో చాలా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. మిగిలిన ఇళ్లను జూన్ నెలలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే వచ్చే నెలలో ఇందిరమ్మ ఇళ్ల రెండో జాబితాను కూడా విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విడతలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని అర్హులైన పేదలకు ఇళ్లు మంజూరు చేసే అవకాశముంది.
