మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పాఠశాలల్లో ఒంటిపూట బడులు ప్రారంభించగా, ఇప్పుడు అంగన్‌వాడీ కేంద్రాల్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.మార్చి 16 నుంచి రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒంటిపూట విధానం అమలులోకి వచ్చింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే కేంద్రాలు నిర్వహించనున్నారు. ఈ విధానం ఏప్రిల్ 23 వరకు కొనసాగనుంది. వేసవి వేడి కారణంగా చిన్నారులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.ఇప్పటివరకు అంగన్‌వాడీ కేంద్రాల్లో వేసవి సెలవులు లేదా ఒంటిపూట విధానం అమలు కాలేదు. అయితే చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తొలిసారిగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. వేసవి సెలవులు ప్రకటించినా గర్భిణీలు, చిన్నారులకు అందించే పౌష్టికాహార పంపిణీలో ఎలాంటి మార్పులు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. టేక్ హోం రేషన్ విధానంలో ఆహారం సరఫరా కొనసాగుతుందని పేర్కొంది.
ఇక రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపిన ప్రకారం తెలంగాణలో 5 వేలకుపైగా అంగన్‌వాడీలను “సక్షమ్ అంగన్‌వాడీ” కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఇందులో భాగంగా మెరుగైన మౌలిక సదుపాయాలు, ఎల్‌ఈడీ స్క్రీన్‌లు, వాటర్ ఫిల్టర్లు, పోషక భవనాలు ఏర్పాటు చేయనున్నారు. అటు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా మార్చి 16 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. వేసవి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్న నేపథ్యంలో త్వరలో సమ్మర్ హాలిడేస్ కూడా ప్రకటించే అవకాశముందని తెలుస్తోంది.
