మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగస్ఫూర్తిని ఎప్పటికీ గుర్తుంచుకుని రాష్ట్ర అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.పొట్టి శ్రీరాములు జయంతి సభలో మాట్లాడిన సీఎం చంద్రబాబు, ఆయన త్యాగ ఫలితంగానే రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరించి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి ఎన్. టి. రామారావు అని సీఎం పేర్కొన్నారు. సమస్యలు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా ప్రజలంతా సమిష్టిగా పని చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రస్తుతం యుద్ధ పరిస్థితుల ప్రభావంతో రాష్ట్రంలో వివిధ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీఎం తెలిపారు. అయితే ఈ ప్రభావం దేశంపై పడకుండా ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. యుద్ధ ప్రభావం ఉందని నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదని, కష్టకాలంలో మరింత ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు.‘వికసిత్ భారత్’ లక్ష్యంతో ప్రధాని మోదీ పనిచేస్తున్నారని, అదే దిశగా ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో నెంబర్–1 రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అందరూ కృషి చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. అలా జరిగితేనే పొట్టి శ్రీరాములు చేసిన త్యాగానికి నిజమైన సార్థకత చేకూరుతుందని ఆయన తెలిపారు.
