Breaking News

ఐటీ నుంచి అగ్రిటెక్ వైపు ఏపీ.. ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’కు సీఎం ప్రతిపాదన

అమరావతి, మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగాన్ని సాంకేతికతతో అనుసంధానించి కొత్త దిశగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు ప్రతిపాదన మేరకు రాష్ట్రంలో ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ (ISA) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. భవిష్యత్ వ్యవసాయాన్ని ఆధునిక సాంకేతికతతో మేళవించి అగ్రిటెక్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే ఈ ప్రతిపాదన లక్ష్యంగా పేర్కొంటున్నారు.ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ప్రపంచ స్థాయి విద్యాసంస్థగా నిలిచిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ తరహాలో వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ అనే డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.

అగ్రిటెక్‌కు ప్రాధాన్యం

రాష్ట్రంలో వ్యవసాయాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానించి రైతుల ఆదాయాన్ని పెంచడమే ఈ యూనివర్సిటీ ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు ఆధారిత అగ్రిటెక్ సేవలు, కొత్తతరం రైతులకు శిక్షణ, వ్యవసాయంలో ఆవిష్కరణలు ప్రోత్సహించడంపై దృష్టి పెట్టనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పరిశోధనలు, శిక్షణ కార్యక్రమాల ద్వారా సుస్థిర సాగు విధానాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్‌కు రికార్డు స్పందన.. 2.38 లక్షల హాల్ టికెట్లు డౌన్‌లోడ్

అంతర్జాతీయ భాగస్వామ్యం

ఈ ప్రాజెక్టుకు ప్రపంచ ప్రసిద్ధి చెందిన నెదర్లాండ్స్‌కు చెందిన వాగెనింగెన్ విశ్వవిద్యాలయం & పరిశోధన ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. వ్యవసాయ విద్య, పరిశోధనలో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థతో కలిసి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే అవకాశాలపై చర్చించారు. జూన్ నాటికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) సిద్ధం చేసే దిశగా చర్యలు ప్రారంభమైనట్లు సమాచారం.

‘సాఫ్ట్‌వేర్ కోడింగ్’ నుంచి ‘సాయిల్ కోడింగ్’

ప్రస్తుత కాలంలో ఐటీ రంగంలో మారుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని యువతను అగ్రిటెక్ వైపు దారితీసే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త వ్యూహం రూపొందిస్తోంది. డ్రోన్లు, డేటా సెంటర్లు, క్వాంటం కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలను వ్యవసాయంతో అనుసంధానించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఎన్టీఆర్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవం ఘనంగా.. వీరంకి గురుమూర్తికి అవార్డు

గ్లోబల్ మార్కెట్‌లో ‘మేడ్ ఇన్ ఏపీ’

ఆంధ్రప్రదేశ్‌లో పండే వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. విలువ ఆధారిత ఉత్పత్తులు, ప్రాసెసింగ్ పరిశ్రమలు, మార్కెటింగ్ అవకాశాలను పెంచడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచానికి ఆహార భాండాగారంగా నిలిచే లక్ష్యంతో ‘ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్’ ఏర్పాటు ప్రతిపాదన రాష్ట్ర వ్యవసాయ రంగానికి కొత్త దిశ చూపుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *