Breaking News

సమగ్ర అభివృద్ధి దిశగా తెలంగాణ.. ఉభయ సభల్లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగం

హైదరాబాద్,మార్చి 16,(నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రం సమగ్ర, సమ్మిళిత, సంపూర్ణ అభివృద్ధి లక్ష్యంతో ఐకమత్యంగా ముందుకు సాగుతోందని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సాధించిన విజయాలు, భవిష్యత్తు లక్ష్యాలను గవర్నర్ సభ ముందు వివరించారు.ప్రపంచంలోనే గుర్తింపు పొందిన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో “తెలంగాణ రైజింగ్–2047” విజన్‌తో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగం, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని చెప్పారు.వేగంగా పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లుగా పునర్వ్యవస్థీకరించామని గవర్నర్ వెల్లడించారు. మూసీ రివర్ ఫ్రంట్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్ట్‌తో పాటు మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధికి అనేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు.

గాంధీ భవన్‌లో మే డే వేడుకలు.. కార్మికులకు ‘శ్రమ శక్తి’ అవార్డులు

రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, బయో ఏషియా సమ్మిట్ నిర్వహించామని, దాదాపు రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో రైతు సంక్షేమ పథకాలు, పంట రుణాల మాఫీ, పెట్టుబడి సాయం, ధాన్యం కొనుగోలు వంటి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.అదేవిధంగా మహిళల సాధికారత కోసం ఉచిత బస్సు ప్రయాణం, సబ్సిడీపై ఎల్‌పీజీ సిలిండర్, గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. విద్యా, వైద్య రంగాల్లో సంస్కరణలు చేపట్టడంతో పాటు కొత్త మెడికల్ కాలేజీలు, ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.సామాజిక న్యాయం సాధించడమే లక్ష్యంగా కుల సర్వే నిర్వహించామని, రిజర్వేషన్ల వర్గీకరణకు చర్యలు తీసుకున్నామని గవర్నర్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయంలో ప్రభుత్వం స్పష్టమైన దృక్పథంతో ముందుకు సాగుతోందని ఆయన అన్నారు.

ఆర్టీసీ కార్మికులకు అండగా ప్రభుత్వం.. సమస్యల పరిష్కారానికి చర్యలు: మంత్రి పొన్నం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *