హైదరాబాద్, మార్చి 25, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు వి.సి. సజ్జనార్ ప్రజలకు కీలక సూచనలు చేశారు.రాష్ట్రంలో సుమారు 60 రోజులకు సరిపడా పెట్రోలు నిల్వలు ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని తెలిపారు. గుజరాత్‌లో కొన్ని ప్రాంతాల్లో ఇంధనం దొరకడం లేదన్న వార్తలను చూసి, హైదరాబాద్‌లో కూడా అదే పరిస్థితి ఉందని భావించి ప్రజలు అనవసరంగా పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లలో నిలబడుతున్నారని పేర్కొన్నారు.కృత్రిమంగా కొరత సృష్టించే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై నిఘా పెట్టామని తెలిపారు.నగర పరిధిలో ఉన్న 186 పెట్రోల్ బంకుల వద్ద పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని వెల్లడించారు. ప్రజలు అపోహలు నమ్మకుండా సాధారణంగా ఇంధనం వినియోగించాలని సూచించారు.ఇంధన కొరతపై భయపడాల్సిన అవసరం లేదని అధికారులు మరోసారి స్పష్టం చేశారు.
