Breaking News

విద్య, వైద్యమే మా ప్రధాన అజెండా: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్, మార్చి 26, నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల అభివృద్ధికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించేందుకు వెనుకాడబోమన్నారు.శాసనసభలో మాట్లాడిన సీఎం, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల వైద్యానికి ఎక్కడా నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. గత 27 నెలల్లో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF), రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాల ద్వారా మొత్తం ₹4,500 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు వివరించారు. ఆరోగ్యశ్రీ ఖర్చులు గణనీయంగా పెరిగినట్లు సీఎం తెలిపారు. గతంలో నెలకు సగటున ₹52 కోట్లు ఖర్చు చేయగా, ప్రస్తుతం ₹89 కోట్లకు పెరిగిందన్నారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ పరిమితిని ₹5 లక్షల నుంచి ₹10 లక్షలకు పెంచడం ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు.

గత ప్రభుత్వం వదిలిన ₹600 కోట్లకు పైగా బకాయిల భారాన్ని మోస్తూనే వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రులకు భారీగా నిధులు విడుదల చేసినట్లు తెలిపారు.ఇక రాష్ట్రంలో వైద్య సేవలను మరింత మెరుగుపరచడానికి కీలక చర్యలు చేపడుతున్నట్లు సీఎం వెల్లడించారు. నిమ్స్, టిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు ₹3,000 కోట్లతో కొత్త ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తున్నామని తెలిపారు. మొత్తం 10,000 పడకల సామర్థ్యంతో ఆధునిక వైద్య సేవలను అందించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు.పేదల భద్రత కోసం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు “ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా” పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రతి కుటుంబానికి ₹5 లక్షల బీమా రక్షణ కల్పించనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది.

శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

వైద్య రంగంలో కొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతూ, ఎన్‌ఆర్‌ఐ వైద్యులను రాష్ట్రానికి అనుసంధానించే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను కూడా ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా విదేశాల్లో ఉన్న నిపుణ వైద్యుల సేవలను రాష్ట్రంలోని ఆసుపత్రులకు అందించనున్నారు. ఆసుపత్రుల నిర్వహణలో కూడా మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. వైద్యులు చికిత్సపై పూర్తి దృష్టి పెట్టేలా, నిర్వహణ బాధ్యతలను వేరుగా విభజించనున్నట్లు సీఎం వెల్లడించారు. అలాగే టీచింగ్ హాస్పిటల్స్‌ను బలోపేతం చేసి వైద్య విద్యార్థులకు ప్రాక్టికల్ అనుభవాన్ని పెంచే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.మొత్తానికి, విద్యలో నర్సరీ నుంచి ఉన్నత స్థాయి వరకు, వైద్య రంగంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వరకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

డ్రైనేజీ లను పరిశీలించిన మున్సిపల్ చైర్మన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *