హైదరాబాద్, మార్చి 28, నేటి తెలుగు పత్రిక: సుదీర్ఘ విరామం తర్వాత హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియం మళ్లీ క్రీడా సందడితో కళకళలాడింది. “Fit Leaders – Fit State” సందేశంతో ప్రారంభమైన “తెలంగాణ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్, కల్చరల్ మీట్ – మొదటి ఎడిషన్” ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది.తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి 14 సంవత్సరాలుగా నిలిచిపోయిన శాసనసభ, శాసనమండలి సభ్యుల క్రీడా సంప్రదాయాన్ని తిరిగి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి మాత్రమే పరిమితం కాకుండా, మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి పలు క్రీడల్లో పాల్గొని క్రీడాస్ఫూర్తిని చాటారు.ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఎల్‌బీ స్టేడియానికి గొప్ప చరిత్ర ఉందని గుర్తుచేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియాన్ని అభివృద్ధి చేయడంతో పాటు గచ్చీబౌలి క్రీడా మైదానాలను భారీగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. 2034 ఒలింపిక్స్ నిర్వహణ లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.గతంలో హైదరాబాద్ క్రీడారంగంలో ముందంజలో ఉండేదని, ఇప్పుడు మళ్లీ యువతలో క్రీడాస్ఫూర్తి పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గ్రామీణ స్థాయి నుంచి ప్రతిభను వెలికితీయడానికి సీఎం కప్ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీను హైదరాబాద్‌కు ఆహ్వానించినట్లు వెల్లడిస్తూ, క్రీడల్లో రాణించే విద్యార్థులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్పారు.అనంతరం నిర్వహించిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొని అందరిలో ఉత్సాహాన్ని నింపారు.


