Breaking News

ఐజేయు సెక్రటరీ జనరల్ సోమసుందర్ కు తాడేపల్లిగూడెం పాత్రికేయుల శుభాకాంక్షలు

మార్చి 31, నేటి తెలుగు పత్రిక: ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) సెక్రటరీ జనరల్ గా ఎన్నికై తొలిసారిగా తాడేపల్లిగూడెం చేరుకున్న డి.సోమ సుందర్ కు తాడేపల్లిగూడెం పాత్రికేయులు మంగళవారం ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలోని ఆయన నివాసానికి వెళ్లి శాలువా, పూలమాలలతో అభినందించారు. ఈ సందర్భంగా సోమసుందర్ మాట్లాడుతూ తాను ఏ స్థాయికి వెళ్లినా ఏపీయూడబ్ల్యూజే అనుబంధ తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ లో సభ్యుడుగానే కొనసాగుతానన్నారు. తన 50 సంవత్సరాల జర్నలిజం జీవితంలో వృత్తిపరంగా అనేక ఉన్నతమైన అవకాశాలు వచ్చినప్పటికీ సొంత ఊరు తాడేపల్లిగూడెం పై మమకారంతో 30 సంవత్సరాల పాటు ఇక్కడే గ్రామీణ విలేకరిగా కొనసాగానన్నారు. యూనియన్ పరంగా తాను ఈ స్థాయికి ఎదగడానికి ఏపీయూడబ్ల్యూజే అనుబంధ తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ తో పాటు ఏపీ పశ్చిమగోదావరి జిల్లా కమిటీ అలాగే ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీల సహకారం అన్నారు. యూనియన్ పరంగా ఏ పని చేయాలన్న తన ఒక్కడి వల్లే కాదని, అందరూ కలిసి వస్తేనే ఏదైనా సాధించగలమన్నారు. అందరూ సహకరించబట్టే తాను ఈ స్థాయికి చేరుకోగలిగాను అన్నారు. దీనిని తాను ఒక పదవిగా అనుకోవడం లేదని, యూనియన్ అప్పగించిన బాధ్యతగా భావిస్తున్నానని చెప్పారు. యూనియన్ నమ్మకాన్ని నిలబెట్టే విధంగా తన శక్తి వంచన లేకుండా పని చేస్తానన్నారు. యూనియన్ పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పని చేసినట్లుగానే దేశంలోని ఇతర రాష్ట్రాలలోనూ యూనియన్ బలోపేతం చేసే దిశగా తన వంతు కృషి కొనసాగిస్తానని చెప్పారు. ఇంకా ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి గజపతి ప్రసాద్, తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ పూర్వ అధ్యక్ష, కార్యదర్శులు చిక్కాల రామకృష్ణ, మైలవరపు రవి కిరణ్, రైట్ నైన్ మీడియా అధినేత వానపల్లి పుండరీ కాక్షుడు, సీనియర్ జర్నలిస్ట్, తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ పూర్వ అధ్యక్షులు షేక్ ఖాదర్ మోహుయుద్దీన్ లు మాట్లాడుతూ యూనియన్ కు సోమ సుందర్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యవర్గ సభ్యుడు బాసంశెట్టి బాలబాలాజీ, పాత్రికేయులు కే. నాగేశ్వరరావు, ఐతం ప్రసాద్, చిట్రోజు కృష్ణ, సింగులూరి వీర్రాజు, వానపల్లి పవన్, వీర్ల హరి, నాని, తదితరులు పాల్గొన్నారు.

గోదావరి కాలుష్యంపై పరిశ్రమలకు మంత్రి దుర్గేష్ హెచ్చరిక

ఏపీలో మినీ ఎన్నికల హీట్.. క్యాడర్‌కు సిద్ధంగా ఉండాలని మూడు పార్టీల పిలుపు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *