Breaking News

వేసవి దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలి

పశువర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డా. ఎం. హనుమంతరావు సూచన

ఎ. కొండూరు, ఏప్రిల్ 2 (నేటి తెలుగు పత్రిక): వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మండలంలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ జిల్లా పశువర్ధక శాఖ సంయుక్త సంచాలకులు, తిరువూరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి డా. ఎం. హనుమంతరావు సూచించారు.గురువారం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం సమావేశ మందిరంలో ఆయన ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో ఉన్న 21 గ్రామ పంచాయతీలు, 18 అనుబంధ తండాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ మంచినీటి కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువులు, పక్షులకు తాగునీరు అందుబాటులో ఉండేలా నరేగా పథకం కింద ఏర్పాటు చేసిన నీటి తొట్లలో నీరు నింపేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
అలాగే గ్రామాల్లో రిపేర్లు ఉన్న చేతి పంపులను వెంటనే బాగుచేయాలని అధికారులను ఆదేశించారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనులు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందించే పోషకాహారం నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించి హాజరు శాతం పెరిగేలా చూడాలని తెలిపారు.మండలంలోని ప్రతి పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు రుచిచూసి ప్రతిరోజూ లీప్ యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగే చిన్నా పెద్ద కార్యక్రమాల్లో వండే ఆహారం, తాగునీటి పరిశుభ్రతపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అన్నారు.
అలాగే ప్రతి గ్రామంలో కార్యాలయాలు, ఆసుపత్రుల్లో వెంటనే చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి మండల ప్రజలు ఎదుర్కొనే సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి, బి. శ్రీనివాసరావు, ఎ పి వో అనురాధ, ఎ పి ఎం, యెహోషువ, పశువర్ధక శాఖ, వైద్యులు ఏడి రామారావు, భరత్, ఎంఈఓ 1 రాజశేఖర్, ఎంఈఓ 2 ఈఎల్ సి, కేశవరావు, వివిధ శాఖల చెందిన అధికారులు పాల్గొన్నారు.

అమరావతికి చట్టబద్ధత.. “ఆంధ్రప్రదేశ్‌కు చారిత్రాత్మక ఘట్టం”: చంద్రబాబు నాయుడు

స్వచ్ఛాంధ్రలో భాగంగా పాఠశాలలో స్వచ్ఛత కార్యక్రమం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *