నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఎంతోకాలంగా అనిశ్చితిలో ఉన్న భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం ఊహించని మలుపు తీసుకుంది. కీలక డీల్ ఖరారవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్స్ హవా కొనసాగుతోంది. ట్రేడ్ డీల్ ప్రకటన అనంతరం ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగి, మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి.వాణిజ్య రంగంలో మోదీ ప్రభుత్వానికి ఇది కీలక విజయంగా మారింది. ఇటీవల యూరోపియన్ యూనియన్‌తో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్న భారత్, వారం వ్యవధిలోనే అమెరికాతో మరో పెద్ద డీల్ సాధించడం విశేషం. ఈ ఒప్పందంలో భాగంగా భారత్‌పై అమెరికా విధించిన సుంకాల్లో భారీ తగ్గింపు చేసింది. రష్యా చమురు కొనుగోళ్లపై విధించిన అదనపు సుంకాలను పూర్తిగా ఎత్తివేయగా, మిగిలిన సుంకాలను గణనీయంగా తగ్గించింది.సుంకాల తగ్గింపుతో భారత ఎగుమతులకు మళ్లీ ఊపొస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు, అమెరికా నుంచి ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు వంటి వాటిని భారత్ పెద్ద మొత్తంలో కొనుగోలు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు.ఈ ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, ప్రజాస్వామిక దేశాలు కలిసి పనిచేస్తే ఇరుదేశాలకు భారీ అవకాశాలు లభిస్తాయని ఆయన వ్యాఖ్యానించారు.
లాభాల్లో మార్కెట్లు, బలపడిన రూపాయి
ట్రేడ్ డీల్ ప్రకటనతో ట్రేడింగ్ ప్రారంభంలోనే దేశీయ స్టాక్ సూచీలు భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 2300 పాయింట్లకు పైగా పెరిగగా, నిఫ్టీ 700 పాయింట్లకు పైగా లాభపడింది. ఆసియా మార్కెట్లు కూడా లాభాల బాటలో సాగుతున్నాయి.డీల్ ప్రభావంతో రూపాయి విలువ డాలర్‌తో పోల్చితే బలపడింది. అదే సమయంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈక్విటీ మార్కెట్ల వైపు ఇన్వెస్టర్ల ఆసక్తి మరింత పెరిగింది.

