నేటి తెలుగు పత్రిక: రెండు నెలల పాటు రాత్రింబగళ్లు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక టమాటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఇంటి వంటలో తప్పనిసరిగా ఉండే టమాటా ధరలు మళ్లీ పాతాళానికి పడిపోవడంతో రైతుల పాలిట కన్నీటి కథగా మారాయి. మార్కెట్‌లో ధరలు కనీస స్థాయికీ చేరకపోవడంతో, పండించిన టమాటాలను పొలాల్లోనే వదిలేస్తున్న దయనీయ పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో మదనపల్లికి తర్వాత అత్యధికంగా టమాటా సాగు జరిగే ప్రాంతంగా ఉమ్మడి కర్నూలు జిల్లా నిలుస్తోంది. పత్తికొండ, ఆలూరు, ఆదోని, ఆస్పరి, మద్దికేర, డోన్, ప్యాపిలి, కోడుమూరు, గోనెగండ్ల, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో వేల ఎకరాల్లో టమాటా పంట సాగు చేస్తున్నారు రైతులు.
కూలీ, ఎరువులు, విత్తనాలు, సాగునీరు, రవాణా వంటి ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో, కిలో టమాటాకు కనీసం రూ.20 వచ్చినప్పుడే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం జిల్లాలో టమాటా ధర కిలోకు కేవలం రూ.5కే పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.ధర గిట్టుబాటు కాకపోవడం ఒకవైపు, మరోవైపు మార్కెట్‌కు తీసుకొచ్చే రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కొందరు రైతులు పండించిన పంటను పొలాల్లోనే వదిలేస్తుండగా, మరికొందరు రోడ్లపక్కన టమాటాలను పారబోస్తున్నారు. ఇంకొందరు మార్కెట్‌లోనే పశువులకు వేస్తూ వేదన వ్యక్తం చేస్తున్నారు.ధరలు పడిపోవడం, కొనుగోలు దారులు లేకపోవడంతో పత్తికొండ టమాటా మార్కెట్ గత వారం రోజుల్లోనే మూతపడింది. దీంతో రైతులు తమ పంటను ఎక్కడ అమ్ముకోవాలో తెలియక అయోమయంలో పడిపోయారు.ఇతర పంటల మాదిరిగానే టమాటాకు కూడా ప్రభుత్వం తగిన గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో ధరలు పడిపోయినప్పుడు కిలోకు కనీసం రూ.8 కంటే తక్కువకు కొనుగోలు చేయరాదని మంత్రి అచ్చం నాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని రైతులు గుర్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆ ఆదేశాలు అమలుకాకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.టమాటా రైతుల సంక్షోభంపై ప్రభుత్వం వెంటనే స్పందించి, కొనుగోళ్లకు మద్దతు ధర కల్పించాలని, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
