Breaking News

💧 కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పోలవరం సహా కీలక సాగునీటి అంశాలపై చర్చ

నేటి తెలుగు పత్రిక: ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సాగునీటి భద్రత, రైతుల భవిష్యత్‌కు కీలకమైన పలు ప్రాజెక్టులపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. వివిధ సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు, ఆర్థిక సహాయం అందించాలని సీఎం చంద్రబాబు కేంద్రమంత్రిని కోరారు.ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతి, ఎదురవుతున్న సమస్యలను సీఎం చంద్రబాబు వివరించారు. పోలవరం పనులపై ఉన్న స్టాప్ వర్క్ ఆర్డర్‌ను శాశ్వతంగా ఎత్తివేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఆర్డర్ వల్ల ప్రాజెక్టు అమలులో జాప్యం జరుగుతోందని, రైతులకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉందని తెలిపారు.

పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంచిన కారణంగా పెరిగిన వ్యయాన్ని కేంద్రం రీయింబర్స్ చేయాలని సీఎం కోరారు. అలాగే పోలవరం ప్రాజెక్టు ఫేజ్–IIకి ఆర్థిక సాయం అందించాలని అభ్యర్థించారు. ఈ దశలో భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టల నిర్మాణం వంటి కీలక పనులు చేపట్టాల్సి ఉందని, ఇందుకోసం సుమారు రూ.32 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని వివరించారు.

పోక్సో కేసులో హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్

గోదావరి వరద జలాలను ఎడారివైపు తరలించే లక్ష్యంతో ప్రతిపాదించిన పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై కూడా చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టు తాగునీరు, సాగునీరు, పరిశ్రమల అవసరాలకు ఎంతో కీలకమని పేర్కొన్న సీఎం చంద్రబాబు, జాతీయ నదుల అనుసంధాన విధానంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేసి సాంకేతిక, ఆర్థిక సాయం అందించాలని కోరారు.అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్–ఒడిశా మధ్య కొనసాగుతున్న వంశధార నీటి వివాదం పరిష్కారంపై సీఎం ప్రస్తావించారు. వంశధార నీటి వివాద ట్రిబ్యునల్ తుది నివేదికను వెంటనే గెజెట్‌లో ప్రచురించాలని కోరారు. ఈ నివేదిక గెజెట్‌లో ప్రచురితమైతే వంశధారపై నిర్మించతలపెట్టిన నేరడి బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమమవుతుందని తెలిపారు.జల్ జీవన్ మిషన్ పథకానికి సంబంధించిన పెండింగ్ నిధులను కూడా విడుదల చేయాలని సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌ను కోరారు. రాష్ట్రానికి సంబంధించిన నీటి ప్రాజెక్టులపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.

‘భోగి’లో డింపుల్ హయతి పవర్‌ఫుల్ లుక్ వైరల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *