Breaking News

లారీపై తరలిపోతున్న రేషన్ బియ్య.మామూళ్ల మత్తులో సివిల్ సప్లై అధికారులు.

పేదల బియ్యం పెద్దల పాలు.

తిరువూరు నియోజకవర్గంలో పక్కదారి పడుతున్న పేదల బియ్యం.

ఓడల ద్వారా విదేశాలకు తరలిపోతున్న రేషన్ బియ్యం.

పేదల బియ్యాన్ని బొక్కేస్తున్న బడా బాబులు.

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం: జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

పిడిఎస్ బియ్యం అక్రమ దారుల్లో మాయం.

రేషన్ మాఫియాకు అడ్డుకట్ట వేసే అధికారులే లేరా!

తూతూ మంత్రంగా అధికారులు తనిఖీలు.

ఎ.కొండూరు ఫిబ్రవరి 11 (నేటి తెలుగు పత్రిక): పేదల కడుపు నింపాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) బియ్యం అక్రమ దారుల్లో మాయం అవుతున్నదా? తిరువూరు నియోజకవర్గంలో భారీ ఎత్తున రేషన్ బియ్యం దుర్వినియోగం జరుగుతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు మధ్యవర్తుల చేతుల్లోకి చేరిన బియ్యం లారీల మార్గం ద్వారా చివరకు పోర్టులకు చేరుకొని ఓడల ద్వారా ఇతర దేశాలకు తరలిపోతున్నట్లు సమాచారం.ప్రజా పంపిణీ బియ్యం తిరువూరు నియోజకవర్గంలో పక్క దారి పడుతుంది.రేషన్ బియ్యం సేకరణకు గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక ముఠాలు పనిచేస్తున్నాయి.ఈ అక్రమ రేషన్ దందా చైన్ సిస్టంలా పని చేస్తూ ఒకరి నుంచి మరొకరు ప్రజల నుంచి బియ్యాన్ని సేకరిస్తున్నారు.వాటి మొత్తాన్ని సేకరించిన బియ్యాన్ని సుదూర ప్రాంతాలకు తరలిస్తూ కోట్లు గడిస్తున్నారు.కిలో బియ్యానికి రూ 10 నుండి 15 రూపాయల వరకు కమీషన్ మిగులుతుండటంతో చాలామంది దీనిని వృత్తిగా మల్చుకుంటున్నారు. తిరువూరు నియోజకవర్గంలోని రూరల్ గ్రామాల్లో అక్రమ రవాణా జరుగుతూనే ఉన్న అక్రమ రేషన్ బియ్యాన్ని ధనార్జనే ధ్యేయంగా కొందరు దళారులు బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు.రేషన్ దుకాణాల్లో సేకరించిన బియ్యాన్ని ఎవరికి అనుమానం రాకుండా రాత్రి వేళల్లో సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. తిరువూరు నియోజకవర్గంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతుంది. అడ్డుకోవలసిన అధికారులు అప్పుడప్పుడు నామమాత్రంగా కేసులు నమోదు చేస్తున్నారు. తప్పితే లోతుగా దర్యాప్తు చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం సరఫరా చేసే బియ్యాన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడటం లేదు.రేషన్ బియ్యాన్ని బహిరంగ మార్కెట్లో విక్రయించి ఆ సొమ్ములతో సన్న బియ్యం కొనుగోలు చేసుకుంటున్నారు.

ఆర్టీసీ బస్సులు – ఆర్టీసీ సిబ్బందితోనే నడవాలి…!

తిరువూరు నియోజకవర్గంలోని 4 మండలాల్లో రేషన్ దందా జోరుగా సాగుతుంది. నియోజకవర్గ మండలాల్లో సేకరించిన బియ్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా లారీల ద్వారా ఓడరేవులకు తరలించి అక్కడ నుండి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు.డీలర్లు బియ్యం పంపిణీ చేస్తున్న సమయంలోనే దళారులు లబ్ధిదారుల నుండి బియ్యాన్ని అక్కడే కొనుగోలు చేస్తున్నారు.మరి కొంతమంది రేషన్ డీలర్లు కూడా దళారులతో చేతులు కలిపి ఈ వ్యవహారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. డీలర్లు బయటకు రాకుండా ఉండేందుకు దళారుల చేత బియ్యాన్ని సేకరించి ఆదాయంలో సమంగా పంచుకుంటున్నట్లు బాహాటంగా ఆరోపణలు వినవస్తున్నాయి.పేదల ఆకలి తీర్చే రేషన్ బియ్యాన్ని కొందరు అధికారుల,ప్రజా ప్రతినిధుల అండదండలతో పక్కదారి పట్టిస్తున్నారు. కొందరు రేషన్ డీలర్లు మిల్లర్లకు కాసులు కురిపిస్తున్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు బియ్యం అందిస్తుండగా డీలర్లు పక్క దారి పట్టిస్తుండటంతో మిల్లర్లు కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తున్నారు. గ్రామాల్లో రేషన్ దుకాణాల నుంచి తరలిస్తున్న అక్రమ రేషన్ బియ్యానికి అడ్డుకట్ట వేస్తారా? ప్రభుత్వం పేదలకు సరఫరా చేస్తున్న రేషన్ బియ్యం అనునిత్యం అక్రమ మార్గంలో తరలించే వ్యక్తులపై చర్యలు తీసుకొని తిరువూరు నియోజకవర్గంలోని రూరల్ గ్రామాల్లో ఉన్న కొన్ని రేషన్ దుకాణాల్లో లెక్కకు మించి రేషన్ నిల్వలు ఉన్నట్లు అందిన సమాచారం.గత వైసిపి ప్రభుత్వం ఆర్గనైసేడ్ మాఫియాను పెంచి పోషిస్తుందంటూ గతంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రతిపక్ష నేతలు ఆరోపణలు గుప్పించిన కూటమి పాలనలోనూ మాఫియాకు ఎదురే లేకుండా పోతుంది. ప్రభుత్వం కళ్ళు గప్పి టన్నులకొద్ది పిడిఎస్ బియ్యం సముద్ర మార్గం ద్వారా విదేశాలకు తరలిపోతుంది. ప్రభుత్వాలు ఏవైనా తమను అడ్డుకునే పాలకులేరంటూ అక్రమార్కులు సవాల్ విసురుతున్నారు.పౌర సరఫరాల శాఖలోని కొందరు అవినీతి తిమింగలాలకు తోడు అధికార పార్టీ నేతలు వెన్నుదన్నుగా నిలుస్తుండటంతో మూడు బస్తాలు ఆరు లారీలు అన్న చందంగా యదేచ్చగా తరలిపోతున్నాయి. అక్రమ వ్యాపారాన్ని కట్టడి చేయాల్సిన విజిలెన్స్ కూడా మామూళ్ల మత్తులో జరుగుతుందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. కొందరు అధికారులే అక్రమ సంపాదనకు అలవాటు పడి పాలకులకు మధ్యవర్తిత్వం వెరసి సంధి చేసుకుంటున్నట్లు విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. కొందరు పోలీస్ అధికారులు సైతం నెలవారి మామూళ్ళు వసూలు చేస్తూ అక్రమ వ్యాపారంలో భాగస్వామ్యం కావడంతో పేదల కడుపు నింపాల్సిన బియ్యం పరాయి దేశాలకు పరుగు పెడుతుంది. రాష్ట్రంలో రేషన్ మాఫియా రెచ్చిపోతుంది. ప్రభుత్వం కళ్ళుగప్పి టన్నులకొద్ది బియ్యం సముద్ర మార్గం ద్వారా విదేశాలకు తరలిపోతున్నా సంబంధిత శాఖాధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.

పౌర సరఫరాల శాఖకు చెందిన కొందరు అవినీతిపరులు అక్రమార్కులతో కుమ్మక్కై ప్రభుత్వ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ బియ్యం అక్రమ రవాణా దారులైన, సహకరించే అధికారులనైనా వదలబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించినా రాచ మార్గంలోనే బియ్యం తరలిపోతున్నాయి. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తో కలిసి స్వయంగా కాకినాడ పోర్టును సందర్శించి, రవాణాకు సిద్ధంగా ఉన్న రేషన్ బియ్యం ఓడలను సీజ్ చేయాలంటూ అప్పట్లో ఆయన ఇచ్చిన ఆదేశాలు సంచలనం రేకెత్తించినా కట్టడికి ప్రత్యేకంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ ఉండేలా చేసినా, అక్రమ రవాణాను అడ్డుకొనే పాలకులే కరువయ్యారు. ఇదంతా మూడు నాళ్ళ ముచ్చటేనని ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. రాయలసీమ నెల్లూరు జిల్లాల నుండి, చెన్నై పోర్టు, ప్రకాశం జిల్లా నుండి శ్రీకాకుళం వరకు, కాకినాడ పోర్టు ద్వారా యదేచ్చగా రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరుగుతోంది.ఇదేమి అధికారులకు తెలియకుండా జరుగుతున్న తంతు కాదని స్వయంగా చీకటి వ్యాపారులే వ్యాఖ్యానిస్తున్నారంటే రేషన్ మాఫియా ఏ స్థాయిలో చెలరేగిపోతుందో అర్థమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతినెలా 2.20 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కోటి 17 లక్షల మంది లబ్ధిదారులకు, ఒక్కొక్కరికి 5 కేజీల బియ్యం పంపిణీ చేస్తోంది. నిరుపేదలందరికీ నాణ్యమైన బియ్యంతో మూడు పూటలా పట్టెడు మెతుకులు పెట్టాలన్న సదుద్దేశంతో ప్రభుత్వం కేజీ బియ్యాన్ని 46.10 పైసలు కొనుగోలు చేసి ఉచితంగా అందిస్తుంది. కొంతమంది డీలర్లు లబ్ధిదారులు బియ్యం తీసుకుంటున్నట్లుగా బయోమెట్రిక్ తీసుకుంటూ నగదు చెల్లిస్తున్నారు.రేషన్ బియ్యం లో దాదాపు 50 శాతం మాఫియాకు విక్రయిస్తున్నట్లు సమాచారం.ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి రేషన్ మాఫియాకు అడ్డుకట్ట వేసి, పేదలకు అందించాల్సిన బియ్యం పేదలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని తిరువూరు నియోజకవర్గ ప్రజలు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *