*✍️-ఏనుగుల వీరాంజనేయులు. సీనియర్ జర్నలిస్ట్
నేటి తెలుగు పత్రిక: యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా 2026-27 బడ్జెట్ కేటాయింపులు ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతూ చెప్పిన మాట. అ అంశాలనే ప్రధాని మోడీ ప్రస్తావించారు. ఈ బడ్జెట్‌లో యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధికి మొత్తం ఇరవై ఐదు కేటగిరిల వారిగా రూ.4,479.88 కోట్లు కేటాయించారు. గతేడాదితో పోల్చితే కొద్దిగా పెరిగినట్లు కనిపించినా అవి నామమాత్రమే. ఈ బడ్జెట్‌లో రూ.500 కోట్లు క్రీడా వస్తువుల తయారీకి ప్రత్యేకంగా కేటాయిస్తున్నట్లు చెప్పారు.ఈ కొద్దిపాటి బడ్జెట్ కేటాయింపులతోనే, యువశక్తిని ఎలా పరుగులు పెట్టిస్తారో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి?ముఖ్యంగా క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్రం చెబుతోంది.క్రీడారంగం క్రమంగా భారీ స్థాయిలో ఉపాధి కల్పించే రంగంగా మారుతోందని, అందుకు ఖేలో ఇండియా మిషన్ ద్వారా సాకారం చేయనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ట్రైనింగ్, కోచింగ్, క్రీడాపోటీల నిర్వహణ, క్రీడారంగంలో మౌలిక వసతుల కల్పన, క్రీడాకారులకు తగిన అవకాశాలు కల్పించడం ‘ఖేలో ఇండియా మిషన్’ లక్ష్యంగా ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. ఈ రంగానికి 2025-26 బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించి, 700 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు చూపించింది. మిగతా రూ.300 ఎక్కుడి దారి మళ్లించింది? దాని గురించి చెప్పలేదు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెబుతున్న ఖేలో ఇండియా మిషన్‌కు 974 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌లో కామన్వెల్త్ క్రీడలకు 28కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్లో దాన్ని యాభై కోట్లకు పెంచినట్లు చూపింది. నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ పథకానికి గత బడ్జెట్లో 42 కోట్లు కేటాయించగా, ఈసారి కేవలం కోటి రూపాయలతో సరిపెట్టింది. నెహ్రు యువకేంద్రాల ప్రాధాన్యతను ప్రభుత్వం విస్మరించింది. మేరా యువభారత్ స్కీంకు 655 కోట్లు కేటాయింపులు చూపింది. నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి గత బడ్జెట్లో 78.64 కోట్లు కేటాయించింది.ఈ బడ్జెట్‌లో కేవలం 46.98 కోట్లకు పరిమితం చేసింది. ఈ బడ్జెట్ కేటాయింపులు ప్రపంచవ్యాప్తంగా క్రీడారంగంలో పోటీతత్వాన్నీ ఎదుర్కొనేందుకు, దేశంలో సమగ్ర క్రీడా విధానాన్ని అమలు చేసేందుకు సరిపోవు. క్రీడల్లో, పథకాల్లో ప్రపంచ దేశాలతో పోటీపడటంలో మన దేశం అట్టడుగు స్థానంలో ఉంటుంది. ఒలంపిక్స్‌లో అత్యధిక పథకాలు సాధించిన దేశంగా యూఎస్‌ఏ అగ్రభాగంలో నిలిచింది. ఇప్పటివరకు జరిగిన అన్ని ఒలంపిక్స్ క్రీడల్లో 2,629 పథకాలు సాధించింది. రెండో స్థానంలో రష్యా,సోయట్ యూనియన్ దేశాలు 1010, బ్రిటన్ 916, చైనా 636, ప్రాన్స్ 751, ఇటలీ 618, జర్మనీ 655, హంగేరి 511, జపాన్ 497, ఆస్ట్రేలియా 547. భారత్ 56 వ స్థానంలో ఉంది. యువతీ యువకులు క్రీడా, సాంస్కృతిక రంగాల్లో మరింత ముందుకు వెళ్లడమే దేశాభివృద్ధికి సూచిక.
నేడు దేశంలో విపరీతంగా పెరుగుతున్న నిరుద్యోగం, క్షీణిస్తున్న ఉపాధి అవకాశాలు, ప్రభుత్వరంగ సంస్థల్లో త్వరతిగతిన ఉద్యోగాల భర్తీ వంటి అంశాల గురించి బడ్జెట్‌లో ఏమాత్రం ప్రస్తావించలేదు. 2014లో మొదటిసారి బీజేపీ అధికారం చేపట్టకు ముందు దేశ యువతకు చేసిన వాగ్దానం, ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు కల్పిస్తామనీ, ఆ లెక్కన ఇప్పటివరకు 24 కోట్ల ఉద్యోగాలు భర్తీచేయాల్సి ఉంది. మరి ఆ వాగ్దానం ఎక్కడికి పోయింది? మేకిన్ ఇండియా, మెడ్ ఇన్ ఇండియా,స్కిల్ ఇండియా, స్టార్ట్ అఫ్ ఇండియా అంటూ హడావుడిచేస్తున్న ప్రభుత్వం, ఈ బడ్జెట్ సందర్భంలో కనీస ప్రస్తావన చేయకపోవడం నిరుద్యోగుల్ని మోసం చేయడమే. దేశంలో యేటేటా నిరుద్యోగం పెరుగుతోందని అనేక సర్వేలు వెల్లడిస్తున్నవి. సెంటర్ ఫర్ మానిటరింగ్ నివేదిక (సీఎంఐఈ) లెక్కల ప్రకారం దేశంలో పట్టణ ప్రాంతా ల్లో 7.8 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 8.6 శాతం నిరుద్యోగిత రెగ్యులర్‌గా పెరుగుతుందని వెల్లడిం చింది. కోట్లాదిమంది నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి మార్గాలు లేక అనేక అవస్తలు పడుతున్నది కళ్లముందు కనిపిస్తున్నదే. అందుకు కారణం కార్పొరేట్ అనుకూల విధానాలు అమలు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలన్నింటిని ప్రయివేటుపరం చేసి, కార్పొరేట్ సంస్థలకు అప్పగించిన ఫలితం.
బిఎస్‌ఎన్‌ఎల్, రైల్వేలు, అగ్రికల్చర్,రక్షణ రంగం తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లో లక్షలాది పోస్టులు సంవత్సరాల తరబడి భర్తీకి నోచుకోవడం లేదు. ప్రభుత్వం కూడా నిర్దిష్ట ప్రణాళికతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చిత్తశుద్ధి చూపడం లేదు. ఆయా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్లూ వేసినప్పుడు పరిమిత సంఖ్యలో ఉన్న పోస్టులకు వేలల్లో,లక్షల్లో యువత పోటీ పడుతున్న తీరే దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగితకు ప్రత్యక్ష ఉదాహ రణ. ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందని, యువశక్తి బలోపేతమవుతుందని చెప్పడం కాదు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి, వలసలు నివారించడం ప్రభుత్వ కర్తవ్యం. ఇతర దేశాలపై ఆధారపడకుండా చూడట నిరుద్యోగానికి పరిష్కారం. ఈ పనిచేయకుండా సర్కార్ ఎన్ని కబుర్లు చెప్పినా ఉపయోగం ఉండదు. పాలక వర్గాల విధానాలపై యువత నిరసన స్వరం మరింత పెంచాలి.
✍️ ఏనుగుల వీరాంజనేయులు. సీనియర్ జర్నలిస్ట్.
