- ప్రముఖ కాపు నేత వడ్డె మల్లిఖార్జున ప్రసాద్, బీసీ నేతలు నెల్లూరి చంద్రశేఖర్ యాదవ్, రాయుడు నాగేశ్వరరావు, రాయుడు సుధాకర్ లకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన బోడె రామచంద్రయాదవ్
- పార్టీ తీర్థం పుచ్చుకున్న వివిధ నియోజకవర్గాలకు చెందిన యువత
మంగళగిరి ఫిబ్రవరి 12 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బలపడుతున్న భారతచైతన్య యువజన (బిసివై) పార్టీలోకి చేరికల పర్వం వెల్లువెత్తింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి, వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రముఖ నాయకులు, యువత, విద్యార్థులు గురువారం నాడు పెద్ద ఎత్తున బిసివై పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో, పార్టీ జాతీయ అధ్యక్షులు బోడె రామచంద్రయాదవ్ వారందరికీ సాదరంగా పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన వారిలో ప్రముఖ కాపు సామాజిక వర్గ నేత శ్రీ వడ్డె మల్లిఖార్జున ప్రసాద్, టీడీపీ సీనియర్ నేత, కాకినాడ జిల్లా శెట్టిబలిజ జనజాగృతి అధ్యక్షులు శ్రీ రాయుడు నాగేశ్వరరావు, రిటైర్డ్ రిజిస్ట్రార్, శెట్టిబలిజ జనజాగృతి ట్రెజరర్ శ్రీ రాయుడు సుధాకర్, ఆల్ ఇండియా బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ నెల్లూరి చంద్రశేఖర్ యాదవ్ ఉన్నారు. వీరితో పాటు ఆత్మకూరు నియోజకవర్గం నుండి 9 మంది యువకులు, తిరువూరు నియోజకవర్గం నుండి 15 మంది విద్యార్థులు, మాచర్ల నియోజకవర్గం నుండి 11 మంది యువకులు, వేమూరు నియోజకవర్గం నుండి 7 మంది, అలాగే గన్నవరం, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, పెదకూరపాడు నియోజకవర్గాల నుండి కూడా పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ సందర్భంగా శ్రీ బోడె రామచంద్రయాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో మార్పును కోరుకుంటున్న ప్రజలందరూ బిసివై పార్టీ వైపు చూస్తున్నారని, అందుకు ఈ భారీ చేరికలే నిదర్శనమని అన్నారు. బలమైన సామాజిక వర్గాల నాయకులు, యువత, విద్యార్థులు పార్టీలో చేరడం శుభపరిణామమని, వారి అనుభవం, శక్తి పార్టీకి ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
అనంతరం, పార్టీలో చేరిన శ్రీ వడ్డె మల్లిఖార్జున ప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్రానికి ప్రస్తుతం ఒక బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరమని, ఆ శక్తి బిసివై పార్టీ, బోడె రామచంద్రయాదవ్ నాయకత్వంలోనే సాధ్యమవుతుందని తాను బలంగా నమ్ముతున్నానని అన్నారు. రాష్ట్రంలోని కాపులందరినీ ఏకం చేసి, బిసివై పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. టీడీపీ సీనియర్ నేత శ్రీ రాయుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ, బోడె రామచంద్రయాదవ్ గారి నిజాయితీ, బీసీల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధికి ఆకర్షితుడనై పార్టీలో చేరానని తెలిపారు. శ్రీ నెల్లూరి చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ, బీసీల హక్కుల కోసం, వారి రాజ్యాధికార సాధన కోసం నిజాయితీగా పోరాడుతున్న ఏకైక నాయకుడు బోడె రామచంద్రయాదవ్ అని, ఆయన నాయకత్వంలో పనిచేయడానికి తాను పార్టీలో చేరానని తెలిపారు.


