Breaking News

చిన వెంకన్న దేవాలయంలో నిబంధనల ప్రకారమే నెయ్యి వాడకం: చైర్మన్ ఎస్ వి సుధాకర్ రావు స్పష్టం

మైలవరం, ఫిబ్రవరి 13: (తెలుగుపత్రిక): ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిబంధనల ప్రకారమే నెయ్యి వాడకం చేసినట్లు ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి (చిన వెంకన్న)వారి దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త, పాలకమండలి చైర్మన్ ఎస్ వి సుధాకర్ రావు స్పష్టం చేశారు. శుక్రవారం నాడు ఆయన ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. “చిన వెంకన్ననూ వదలని కల్తీ నెయ్యి” అనే శీర్షికన సోషల్ మీడియాలోనూ, కొన్ని దినపత్రికలలో వచ్చిన వార్తపై ఆయన తీవ్రంగా స్పందించారు. ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానానికి సరఫరా చేసిన నెయ్యి కూడా కల్తీ నెయ్యి అని సిట్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఈ అంశంపై ఆయన మీడియాకు వివరణ ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగానే దేవస్థానంలో నెయ్యి వినియోగం జరిగిందన్నారు. గతంలో దేవస్థానంలో ప్రభుత్వ ఆమోదం పొందిన కో-ఆపరేటివ్ డైరీలలో (విజయ, సంగం) మాత్రమే నెయ్యి వినియోగం కొటేషన్ పద్ధతిన జరిగిందన్నారు. 24-1-2022 న ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయపు మెమో ఆర్ సి నంబర్ డి2/14025 (34)/39/2022 ద్వారా టెండర్ పద్ధతిన డీలర్స్, రిటైల్ సప్లయర్స్, డైరీల ద్వారా తక్కువ టెండర్ దారునిచే నెయ్యి వినియోగం చేసుకొనమని ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దీని ప్రకారం లోయస్ట్ కొటేషన్ దారునికి అవకాశం ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పద్ధతి అమలుపరచడం వలన లోయస్ట్ టెండర్ దారుడైన వినాయక ఏజెన్సీస్ (శ్రీ వైష్ణవి డైరీ)నుండి దేవాలయము నెయ్యి కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఏ ఉద్దేశంతో ఈ పద్ధతిని అమలు పరిచమన్నారో వారికే తెలియాలన్నారు. టెండర్ క్వాలిఫై అయిన వారు సప్లై చేసిన నెయ్యిని జాతీయ సంస్థ ఆయన ఎన్ ఏ బి టి సి ఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లేబరేటరీస్) వారిచే ఆమోదం పొందిన అక్యురేట్ ల్యాబ్ విజయవాడ వారిచే నెయ్యి క్వాలిటీ చెక్ సర్టిఫికేషన్ స్వచ్ఛమైనదని ఆమోదం చేసిన తర్వాతే వినియోగించామన్నారు. ఆ సమయంలో ఎవరి వద్ద నుండి ఏ రకమైన అభియోగము రాలేదన్నారు. తర్వాత ట్రస్ట్ బోర్డు ఆమోదంతో ఎండోమెంట్స్ కమీషనర్ వద్ద నుండి ఉత్తర్వులు పొంది అతిపెద్ద కోపరేటివ్ డైరీ అయిన సంగం డైరీ నుండి గతంలో వలె ఈ టెండర్ పద్ధతిన కొనుగోలు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద దేవాలయాలలో ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఒకటని గుర్తు చేశారు. దేవస్థానం మేనేజ్మెంట్ విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఏపీ డాష్ బోర్డు నందు రాష్ట్రంలో ఉన్న ఏడు నోటిఫైడ్ దేవాలయాలలో ద్వారకాతిరుమల దేవస్థానం భక్తులకు సౌకర్యాల కల్పనలో ఒకసారి రెండో స్థానంలోనూ, ప్రస్తుతం ప్రథమ స్థానంలో గుర్తింపు పొందింది అన్నారు. భక్తులు మరియు దాతల సహకారంతో ఈ ధార్మిక సంస్థ నడుస్తుందన్నారు. రాష్ట్రంలో అన్నదానములో పరిమితి లేకుండా అన్న ప్రసాద వితరణ తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత ద్వారకాతిరుమల దేవస్థానం మొదటి స్థానంలో ఉందన్నారు. భక్తుడే భగవంతుడని సౌకర్యాల కల్పనలో భక్తుల మనోభావాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఎటువంటి గోప్యత లేదన్నారు. భక్తుడైనా, దాత అయినా ఎప్పుడైనా, ఏ విషయంలోనైనా కార్యనిర్వహణాధికారి సమక్షంలో పరిశీలన చేసి తెలుసుకొనుటకు అవకాశం కల్పించామన్నారు. వాస్తవానికి గతంలో ఉన్న నిబంధనలను ఎందుకు మార్చాల్సి వచ్చిందో దాతలు, భక్తులు గమనించాలని ఆయన పేర్కొన్నారు. అదే నిబంధనలను దేవాలయాలు అనుసరించాల్సి వచ్చిందన్నారు. నెయ్యిపై సర్టిఫికేషన్ చేసిన వారు ఎలా సర్టిఫై చేశారని ఆయన ప్రశ్నించారు. నెయ్యి వినియోగంపై ఏ దేవస్థానం తప్పిధం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కొన్ని వార్తా ప్రకటనల వలన దేవస్థానాల యొక్క కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. దైవ సంబంధిత విషయాలలో ఏదైనా ప్రకటనలు చేసే ముందు పూర్తి విషయాలను పరిశీలించి దేవస్థానాలకు సంబంధించిన అధికారులు గానీ పాలకమండలి చైర్మన్ ను గానీ వివరణతో కూడిన ప్రకటన చేస్తే బాగుంటుందన్నారు. భగవంతుడు అతీతుడని, ప్రస్తుతం అన్ని దేవాలయాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగానే దేవస్థానాలలో నెయ్యి వినియోగం జరిగిందని ఎస్వీ సుధాకర్ రావు మరో మారు స్పష్టం చేశారు.

ఫలించిన ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య వ్యూహం

కరీంనగర్ కార్పొరేషన్ లో వికసించిన కమలం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *