మే 02, (నేటి తెలుగు పత్రిక): ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న ‘స్వచ్ఛరథాలు’ కార్యక్రమానికి ప్రముఖ సినీ హీరో నాని సహాయం చేయడంపై డిప్యూటీ సీఎంవో స్పందించింది. అడిగిన వెంటనే తన వంతు సహకారం అందించినందుకు నానికి ప్రశంసలు కురిపించింది. డిప్యూటీ సీఎంవో ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో, “మన పారిశుద్ధ్యం.. మన ఆరోగ్యం.. మన బాధ్యత” అనే నినాదంతో పవన్ కళ్యాణ్ ఆలోచనల నుంచి స్వచ్ఛరథాలు కార్యక్రమం ప్రారంభమైందని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ కార్యక్రమం విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోందని పేర్కొంది.ఏప్రిల్ నెలలో స్వచ్ఛరథాల ద్వారా సుమారు 19 లక్షల కేజీల పొడి చెత్త సేకరించి, దానికి బదులుగా రూ.3.32 కోట్ల విలువైన నిత్యావసర వస్తువులను ప్రజలకు అందించినట్లు వెల్లడించింది. చెత్త నుంచి సంపద సృష్టి లక్ష్యంతో ప్రజలను భాగస్వాములుగా మార్చడం ఈ కార్యక్రమం ప్రత్యేకతగా పేర్కొంది.ఇక ప్రతి గురువారం పాఠశాలలకు వెళ్లి, విద్యార్థులకు పొడి చెత్తకు బదులుగా పుస్తకాలు, స్టేషనరీ అందించే కార్యక్రమం కూడా మంచి ఫలితాలు ఇస్తోందని తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్ తరాలకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన పెంచుతున్నామని వివరించింది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్, అలాగే సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు లక్ష్యంగా పెట్టుకున్న స్వచ్ఛాంధ్ర సాధనలో ఈ స్వచ్ఛరథాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని డిప్యూటీ సీఎంవో పేర్కొంది.
