Breaking News

మెదక్‌లో వరుస చోరీలు.. గ్రామంలో భయాందోళనలు

మే 15, (నేటి తెలుగు పత్రిక): మెదక్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. పెద్దశంకరంపేట మండలం చీలపల్లి గ్రామంలో ఒకే రాత్రిలో వరుసగా నాలుగు ఇళ్లలో చోరీలు జరగడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భారీ మొత్తంలో బంగారం, వెండి అపహరించబడినట్లు సమాచారం.గ్రామానికి చెందిన రాయిని రాములు కుటుంబం వివాహ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరని గమనించిన దుండగులు అర్ధరాత్రి సమయంలో ఇంటిలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లిన దొంగలు బీరువాలను బద్దలు కొట్టి సుమారు 120 తులాలకు పైగా బంగారు ఆభరణాలు, కిలో వెండిని దోచుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం ఇంటికి వచ్చిన పనిమనిషి తాళాలు పగిలి ఉండటాన్ని గుర్తించి యజమానులకు సమాచారం ఇచ్చింది. అనంతరం కుటుంబ సభ్యులు గ్రామానికి చేరుకుని చోరీ జరిగిన విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. దొంగలు ముందుగా ఇంటిపై నిఘా పెట్టి ప్రణాళికాబద్ధంగా చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.అదే రాత్రి గ్రామంలోని మరో మూడు ఇళ్లలో కూడా చోరీలకు యత్నించినట్లు సమాచారం. కొన్ని చోట్ల నగదు, వెండి వస్తువులు అపహరించగా, మరికొన్ని ఇళ్లలో ప్రయత్నం విఫలమైందని తెలుస్తోంది.వరుస ఘటనలతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి పహారా పెంచాలని, పోలీస్ పట్రోలింగ్‌ను బలోపేతం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *