Breaking News

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు కేబినెట్ ఆమోదం.. 2.5 లక్షల ఇళ్ల మంజూరు

మే 24, (నేటి తెలుగు పత్రిక): తెలంగాణ రాష్ట్రంలో రెండో విడతగా 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 2 వేల ఇళ్ల చొప్పున కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించింది.జూన్ 1న ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.హైదరాబాద్ కోర్ అర్బన్ ప్రాంతంలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అదనంగా 1 లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంటి స్థలం లేని నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలకు వారు ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాల వద్దే స్థలాలు గుర్తించి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు.రాష్ట్రవ్యాప్తంగా పూరిగుడిసెల్లో నివసిస్తున్న సుమారు 15 వేల కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించాలని కూడా మంత్రివర్గం తీర్మానించింది.వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. విద్యార్థుల హాజరు, ఆరోగ్య పరిస్థితులను మెరుగుపర్చే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.అలాగే 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం రూ.1000 కోట్లు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విద్యుత్ పంపిణీ, మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్డీఎస్‌ఎస్ పథకంలో చేరేందుకు తెలంగాణ డిస్కంల ప్రతిపాదనలకు కూడా ఆమోదం లభించింది.పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూసేకరణ, పునరావాసం, మౌలిక వసతుల కోసం రూ.587 కోట్లు కేటాయించారు.ఇక రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30కు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు, 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించేలా ఈ పాలసీ రూపొందించారు.లైఫ్ సైన్సెస్, ఫార్మా, బయోటెక్, మెడికల్ ఇన్నోవేషన్ రంగాల్లో తెలంగాణను ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని ప్రభుత్వం వెల్లడించింది.

రేవంత్‌రెడ్డికి మోదీ రాజకీయ ఆఫర్ ఇచ్చారా?: ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో చర్చ

మధ్యలో నిలిచిన ఇందిరమ్మ ఇళ్లకు ఆర్థికసాయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *