వైసీపీ అధినేత జగన్ అధ్యక్షతన ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఏపీ ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేయాలని ఎంపీలకు జగన్ సూచించారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైసీపీ మద్దతు ఉంటుందని ప్రకటించారు.ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పోటీ పరీక్షలు లేకుండా డీఎస్పీ పోస్టుల భర్తీని రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా ఆయన అభివర్ణించారు. డీఎస్సీ టీచర్ నియామకాల్లో తీవ్రమైన అవకతవకలు జరిగాయని, తమ మనుషులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రత్యేక జీవోలు తెచ్చి ఆ పని పూర్తయ్యాక వాటిని రద్దు చేశారని ఆరోపించారు. క్రీడా సంఘాల్లో సైతం అధికార పార్టీ పెద్దల పెత్తనం కొనసాగుతోందని, సాఫ్ట్‌బాల్, జూడో సంఘాల్లో టీడీపీ నేతలను నియమించుకున్నారని ప్రస్తావించారు.
ప్రభుత్వ భూముల దోపిడీపై జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని నిర్మాణంలో చదరపు అడుగుకు రూ.20,000పైగా ఖర్చు చూపిస్తున్నారని, భూసమీకరణకు నిరాకరించిన రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని విమర్శించారు. రూ.5,000 కోట్లతో నిర్మించిన రామాయపట్నం పోర్టును కేవలం రూ.1,500 కోట్లకే ప్రైవేటు సంస్థలకు అప్పగించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.అప్పుల కుప్పపై కూడా జగన్ హెచ్చరించారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులు దాటి రెండేళ్లలోనే రూ.3.6 లక్షల కోట్ల అప్పులు చేసినా ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ఇసుక, మైనింగ్, మద్యం రంగాల్లో మాఫియా పెత్తనం కొనసాగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు.
