Breaking News

మాఘ పౌర్ణమి అత్యంత పవిత్రమైనది

పులివెందుల ఫిబ్రవరి 1 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): తెలుగు మాసాలలో మాఘ పౌర్ణమి అత్యంత పవిత్రమైనదని ఆధ్యాత్మికవేత్త తులసి రెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా వీరపునాయుని పల్లి మండలం సంగాలపల్లి గ్రామంలో శివకృష్ణ గో సంరక్షణ శాలలో ఆదివారం గరుకు స్తంభ ప్రతిష్ఠ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కుమ్మితి సుబ్బరామిరెడ్డి, కుమ్మితి శేషారెడ్డి, వనిపెంట జయరామిరెడ్డి, యాపరాల వెంకటసుబ్బారెడ్డి, ముడుమాల పిచ్చిరెడ్డి, రాజోలు సుబ్బారెడ్డి, మూల జయరామిరెడ్డి వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గరుకుస్తంభ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తులసి రెడ్డి మాట్లాడుతూ తెలుగు మాసాలలో మాఘమాసం అత్యంత పవిత్రమైనదని, మాఘ పౌర్ణమి రోజు మరింత పవిత్రమైనదని అన్నారు. అటువంటి పవిత్రమైన రోజున శివకృష్ణ గోశాలలో గరుకు స్తంభ ప్రతిష్ట చేయడం సంతోషదాయకం అన్నారు. గరుకు స్తంభ ప్రతిష్ట గో సంరక్షణలో ఒక భాగమని, గంగడోలు, కంటి దగ్గర, తదితర తోకకు అందని ప్రదేశాలలో గోవులకు దురద పుట్టినప్పుడు గరుకుస్తంభం ఎంతో ఉపయోగపడుతుందని, గోవులకు దురద,అలసట నుండి ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. గరుకుస్తంభ ప్రతిష్ట 100 గోదానాలతో సమానమని, పాప నివారణ కలుగుతుందని, పితృదేవతలకు స్వర్గ ప్రవేశం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయని తులసి రెడ్డి అన్నారు. ప్రాచీన కాలము నుండి గోమాతకు,భారతీయ సంస్కృతికి అవినాభావ సంబంధం ఉందని, గోమాత సేవ గోవిందుని సేవతో సమానమని తులసి రెడ్డి అన్నారు. ఆవు పాలు,పాల ఉత్పత్తులు చాలా శ్రేష్టమైనవని,148 మానసిక,శారీరక రోగాలకు ఇవి దివ్య ఔషధాలని శాస్త్రీయంగా నిరూపించబడిందని తులసి రెడ్డి అన్నారు. గో ప్రదక్షిణం ముక్కోటి దేవతల ప్రదక్షిణముతో సమానం అన్నారు. గోవుల సంఖ్య రాను రాను తగ్గిపోతున్నదని,స్వాతంత్రం వచ్చేనాటికి దేశంలో గోవుల సంఖ్య 32 కోట్లు కాగా ప్రస్తుతం ఏడు కోట్లు మాత్రమే అన్నారు. గోసంరక్షణకు ప్రతి ఒక్కరూ పూనుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో శివకృష్ణ గోశాల నిర్వాహకులు కల్లూరు రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు, ఎర్రగుంట్ల కు చెందిన వేణుగోపాల స్వామి భజన బృందం వారు,సీనియర్ కాంగ్రెస్ నాయకులు అమర్నాథ్ రెడ్డి, ఉత్తన్న, తోపిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి,శ్రీనివాసులు, నామా వినయ్ భక్తులు పాల్గొన్నారు.

ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ సత్య జన్మదిన వేడుకలు

ఎల్‌పీజీ కొరతపై కేంద్రానికి రాష్ట్ర విజ్ఞప్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *