నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మరో కీలక లాభం దక్కింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 15 వేల ప్రభుత్వ స్కూళ్లు, 500 కాలేజీల్లో ఈ ల్యాబ్‌లు నెలకొల్పనున్నారు.ఈ ల్యాబ్‌ల ద్వారా విద్యార్థులకు యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ వంటి ఆధునిక రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. దీని ద్వారా విద్యార్థులకు భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడడంతో పాటు స్వయం ఉపాధికి కూడా ఇది దోహదపడనుంది. ఉపాధి కల్పన లక్ష్యంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణకు 500 ల్యాబ్‌లు
కేంద్రం ప్రకటించిన కంటెంట్ క్రియేటర్ ల్యాబ్‌లలో తెలంగాణకు 500 వరకు కేటాయింపులు జరిగాయి. ఇవి ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు కానున్నాయి.ఇక 2016లో ప్రారంభించిన అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద ఇప్పటికే దేశవ్యాప్తంగా 10 వేల టింకరింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయగా, వాటిలో తెలంగాణలో 400 ల్యాబ్‌లు ఉన్నాయి. 2025-26 బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.500 కోట్లు కేటాయించగా, తాజా బడ్జెట్‌లో కేటాయింపులను రూ.3200 కోట్లకు పెంచారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా 30 వేల ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. దీంతో తెలంగాణకు మరిన్ని ల్యాబ్‌లు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
జిల్లాకో గర్ల్స్ హాస్టల్
విద్యార్థినుల సౌకర్యార్థం దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక గర్ల్స్ హాస్టల్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం బడ్జెట్‌లో ప్రకటించింది. ఈ నిర్ణయంతో తెలంగాణలోని విద్యార్థినులకు భారీ లాభం చేకూరనుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఇంజినీరింగ్ కాలేజీల్లో సుమారు 45 శాతం అమ్మాయిలు చదువుతున్నారు. హాస్టల్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో వారి ఇబ్బందులు తగ్గనున్నాయి.
తెలంగాణలో మొత్తం 33 జిల్లాలు ఉన్నందున రాష్ట్రానికి 33 గర్ల్స్ హాస్టళ్లు రానున్నాయి. ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో హాస్టల్ వసతి లేక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నిర్ణయంతో వారికి సౌకర్యవంతమైన వసతి లభించనుంది.
రైలు కారిడార్లు, రాజకీయ విమర్శలు
బడ్జెట్‌లో భాగంగా కేంద్రం హైదరాబాద్–పుణె, హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్లను కూడా ప్రకటించింది. అయితే వీటిని మినహాయిస్తే తెలంగాణకు బడ్జెట్‌లో పెద్దగా కేటాయింపులు లేవని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ వారు విమర్శలు గుప్పిస్తున్నారు.

