నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణ ముగిసింది. నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం 7 గంటల 45 నిమిషాల వరకు కొనసాగింది. మొత్తం నాలుగు గంటల 45 నిమిషాలపాటు అధికారులు ప్రశ్నించారు.
విచారణ సందర్భంగా కేసీఆర్ ఇంటి పరిసరాల్లో ఐదుగురు డీసీపీలతో పాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాలుగు అంచెల భద్రతతో పోలీసులు నిఘా కొనసాగించారు. రెండో అంతస్తులోని ఓ గదిలో విచారణ జరగగా, మొత్తం ప్రక్రియను ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేశారు.విచారణ ముగిసిందనే సమాచారం అందగానే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు నందినగర్‌కు తరలివచ్చారు. కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ బాల్కనీలోకి వచ్చి అభివాదం చేశారు. అనంతరం కేటీఆర్, హరీశ్‌రావు, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు.
తదనంతరం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో మున్సిపల్ ఎన్నికలపై కేసీఆర్ చర్చించారు. గ్రౌండ్ లెవల్‌లో పార్టీ బలంగా ఉందని, రెబల్స్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నేతలకు సూచించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్‌ఎస్ బలపడుతోందని, త్వరలో మరికొందరు పార్టీలో చేరనున్నారని వెల్లడించారు. అనంతరం కేసీఆర్ నందినగర్ నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌కు వెళ్లిపోయారు.ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణపై తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న నాయకుడు కేసీఆర్ అని అన్నారు. చిల్లర రాజకీయాలు, నీచమైన ఎత్తుగడలకు కేసీఆర్ భయపడే వ్యక్తి కాదని స్పష్టం చేశారు.
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, కాంగ్రెస్-బీజేపీ ప్రభుత్వాల వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్‌ను విచారణ పేరుతో వేధిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు సిట్ వ్యవహరిస్తోందని విమర్శించారు. చట్టప్రకారం కేసీఆర్ ఉన్నచోటే విచారణ జరగాలన్నా, చట్టాన్ని గౌరవిస్తూ ఆయన విచారణకు హాజరయ్యారని తెలిపారు. ప్రజల్లో అపోహలు సృష్టించేందుకే ఈ విచారణ నాటకంగా మారిందని మండిపడ్డారు.ఇదిలా ఉండగా, కేసీఆర్ విచారణ కొనసాగుతున్న సమయంలో తెలంగాణ భవన్ సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రేవంత్‌రెడ్డి ఇంటి వైపు వెళ్లేందుకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. పలుమార్లు మహిళా కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

