Breaking News

చేనేతకు కేంద్ర బడ్జెట్లో తీవ్ర అన్యాయం

బడ్జెట్ సవరణ చేసి రూ.20 వేల కోట్లు కేటాయించాలి: ఏపీ చేనేత కార్మిక సంఘం డిమాండ్

మంగళగిరి ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): 2026 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.53 లక్షల 47 వేల కోట్ల బడ్జెట్‌లో చేనేత రంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం తీవ్రంగా ఖండించింది. జౌళి శాఖకు మొత్తం రూ.5,272 కోట్లు కేటాయించగా, అందులో చేనేతకు కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేటాయించడం దుర్మార్గమైన నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి నాగేశ్వరరావు విమర్శించారు. సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. 2025 బడ్జెట్‌తో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్ మొత్తం రూ.3 లక్షల కోట్లకు పైగా పెరిగినప్పటికీ, చేనేత రంగానికి కనీసం ఆదామాషా పద్ధతిలోనైనా నిధులు పెంచాలన్న ఆలోచన కూడా లేకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఖరిని స్పష్టంగా ప్రతిబింబిస్తోందన్నారు.
దేశ వ్యాప్తంగా సుమారు 35 లక్షల మగ్గాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయని, చేనేత పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి సుమారు 8 కోట్ల మంది జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో చేనేత పరిశ్రమను కాపాడుతామని వాగ్దానాలు చేసిన ప్రభుత్వం, ప్రస్తుతం కార్మికులు ఉపాధి లేక, సరైన మజూరి అందక ఆకలి చావులు, ఆత్మహత్యలకు గురవుతున్నా పట్టించుకోకపోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
కనీసం బడ్జెట్‌లో 0.5 శాతం అయినా చేనేత రంగానికి కేటాయించి ఈ పరిశ్రమను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కానీ చేనేత పరిశ్రమ భారతదేశంలో ఉందన్న విషయమే కేంద్ర పాలకులకు గుర్తు రానట్టుగా వ్యవహరించడం శోచనీయమని తీవ్రంగా విమర్శించారు.ఈ బడ్జెట్‌ను ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొంటూ,
బడ్జెట్‌ను వెంటనే సవరించి చేనేత రంగానికి కనీసం రూ.20 వేల కోట్లు కేటాయించాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని పిల్లలమర్రి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.

ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ సత్య జన్మదిన వేడుకలు

ఎల్‌పీజీ కొరతపై కేంద్రానికి రాష్ట్ర విజ్ఞప్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *