తెనాలి ఫిబ్రవరి 3 : (నేటి తెలుగు దిన పత్రిక ప్రతినిధి): తెనాలి మండలంగుడివాడ గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాలను జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పంపిణీ చేశారు. క్యూఆర్ కోడ్, విశిష్ట సంఖ్యతో ఉన్న, భూమి వివరాలతో కూడిన రాజ ముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను మంగళవారం జిల్లా కలెక్టర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు, భూ యజమానుల ఆస్తులకు భద్రత కల్పించేలా కొత్త టెక్నాలజీతో పట్టాదారు పాస్ పుస్తకం తయారు చేసినట్టు చెప్పారు. గ్రామసభలు నిర్వహించి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.ఎక్కడా వివాదాలకు తావివ్వకుండా రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నామని చెప్పారు. జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకంపై క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే భూమి వివరాలు తెలుస్తాయని చెప్పారు. ప్రభుత్వం ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకంతో ఆస్తిపై పూర్తి భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. ఇకేవైసీ పూర్తి అయ్యాకే పాస్ పుస్తకం ముద్రించి జారీ చేయడం జరిగిందన్నారు. దేశంలో ఆంధ్ర ప్రదేశ్ ఒక రోల్ మోడల్ గా రీ సర్వే ప్రాజెక్ట్ ను తీసుకువచ్చిందని, సైంటిఫిక్ గా డ్రోన్, రూటర్లతో రీ సర్వే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. గ్రామ సభలు నిర్వహించి లోపాలు సవరించి తయారు చేయడం జరిగిందని చెప్పారు. రీ సర్వే ద్వారా నిజమైన హక్కుదారుకు వారి పేరున పట్టాదారు పాసు పుస్తకాలను అందించడం జరుగుతుందన్నారు.ఈ సందర్భంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని తనిఖీ చేశారు.ఈ కార్యక్రమంలో తహసశీల్దార్ కె. వి.గోపాల కృష్ణ, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

