Breaking News

చేనేతకు నిధులు కరవు – కేంద్ర విధానాలపై మండిపాటు

రూ.53 లక్షల కోట్ల బడ్జెట్‌లో చేనేతకు రూ.200 కోట్లు మాత్రమే – నిర్లక్ష్యానికి పరాకాష్ఠ

చేనేతను మరిచిన కేంద్రం – రూ.20 వేల కోట్ల కేటాయింపుకు ఏపీ చేనేత కార్మిక సంఘం డిమాండ్

ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ సత్య జన్మదిన వేడుకలు

మంగళగిరి ఫిబ్రవరి 02 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): 2026 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.53 లక్షల 47 వేల కోట్ల బడ్జెట్‌లో చేనేత రంగానికి తీవ్ర అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం తీవ్రంగా ఖండించింది. జౌళి శాఖకు మొత్తం రూ.5,272 కోట్లు కేటాయించినప్పటికీ, అందులో చేనేత రంగానికి కేవలం రూ.200 కోట్లు మాత్రమే కేటాయించడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి పరాకాష్ఠగా మారిందని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తూరి మోహనరావు తీవ్రంగా విమర్శించారు.మంగళవారం మంగళగిరి పట్టణంలోని వేములపల్లి శ్రీకృష్ణ భవన్‌లోని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 2025 బడ్జెట్‌తో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్ మొత్తం రూ.3 లక్షల కోట్లకు పైగా పెరిగినప్పటికీ, చేనేత రంగానికి కనీసం దామాషా పద్ధతిలోనైనా నిధులు పెంచాలన్న ఆలోచన లేకపోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమని అన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 35 లక్షల మగ్గాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని, చేనేత పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 8 కోట్ల మంది ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో చేనేత పరిశ్రమను కాపాడుతామని ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రస్తుతం చేనేత కార్మికులు ఉపాధి లేక, సరైన మజూరి అందక తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడుతున్నారని, ఆకలి చావులు, ఆత్మహత్యల వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
కనీసం కేంద్ర బడ్జెట్‌లో 0.5 శాతం అయినా చేనేత రంగానికి కేటాయించి ఈ సంప్రదాయ పరిశ్రమను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కానీ చేనేత పరిశ్రమ భారతదేశంలో ఉందన్న విషయమే పాలకులకు గుర్తు రానట్టుగా వ్యవహరించడం శోచనీయమని తీవ్రంగా విమర్శించారు.ఈ బడ్జెట్‌ను ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తున్నదని ప్రకటించిన బత్తూరి మోహనరావు, బడ్జెట్‌ను వెంటనే సవరించి చేనేత రంగానికి కనీసం రూ.20 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గజవల్లి వెంకటకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు గంజి శ్రీనివాసరావు, మంగళగిరి నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు బత్తుల గిరి, దొడ్డి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఎల్‌పీజీ కొరతపై కేంద్రానికి రాష్ట్ర విజ్ఞప్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *