ఫిబ్రవరి చివర్లో అకౌంట్లలోకి డబ్బులు.. ముహూర్తం ఫిక్స్
నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తెలంగాణ రైతులకు డబుల్ బొనాంజా దక్కనుంది. పీఎం కిసాన్, రైతు భరోసా పథకాల కింద పెట్టుబడి సాయం ఒకేసారి రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర బడ్జెట్ ప్రక్రియ పూర్తవ్వడంతో పీఎం కిసాన్ నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా రైతు భరోసా నిధుల జమకు సన్నాహాలు చేస్తోంది.
పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపులు
తెలంగాణలో యాసంగి సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు రైతు భరోసా సొమ్ము జమ కాలేదు. జనవరిలోనే పెట్టుబడి సాయం ఇవ్వాల్సి ఉండగా పలు కారణాలతో ప్రభుత్వం వాయిదా వేసింది. దీంతో రైతులు సాగు పనులకు డబ్బుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించడం, బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవడం, బ్యాంకుల నుంచి అగ్రికల్చర్ లోన్లు పొందడం వంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. పెట్టుబడి సాయం త్వరగా విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
త్వరలో పీఎం కిసాన్ నిధులు
కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రైతులకు రూ.2 వేల చొప్పున జమ చేసే 22వ విడత నిధులను త్వరలో విడుదల చేయనుంది. బడ్జెట్ ప్రక్రియ ముగియడంతో ఫిబ్రవరి చివరి వారంలో ఏ క్షణంలోనైనా నిధులు రిలీజ్ చేసే అవకాశముందని తెలుస్తోంది. ఈ విడతను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం.
రైతు భరోసా నిధులపై స్పష్టత
పీఎం కిసాన్‌తో పాటు రైతు భరోసా నిధులను కూడా ఫిబ్రవరి చివరి వారంలోనే విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి నాటికే ఈ సాయం ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, సాగులో ఉన్న భూములను గుర్తించే శాటిలైట్ సర్వే పూర్తికాకపోవడంతో జాప్యం జరిగింది.ఇటీవల ఈ సర్వే ప్రక్రియ పూర్తవ్వగా.. నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. సర్వే ప్రకారం దాదాపు 10 శాతం భూముల్లో ప్రస్తుతం పంట సాగు లేకపోవడంతో, ఆ భూములకు రైతు భరోసా నిలిపివేయనున్నారు. మిగతా అర్హులైన రైతులకు మాత్రం నిధులు ఫిబ్రవరి చివర్లో జమ చేయనున్నారు.
రైతులకు డబుల్ బొనాంజా
పీఎం కిసాన్, రైతు భరోసా నిధులు ఒకేసారి జమైతే రైతులకు పెద్ద ఊరట దక్కనుంది.
- కేంద్ర ప్రభుత్వం: పీఎం కిసాన్ కింద రూ.2,000
- తెలంగాణ ప్రభుత్వం: రైతు భరోసా కింద ఎకరానికి రూ.6,000
ఈ నెల చివరికల్లా భారీ మొత్తంలో డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి చేరే అవకాశముండటంతో తెలంగాణ రైతుల్లో ఆశలు పెరిగాయి.

