లోక్‌సభలో కేంద్రమంత్రి కీలక ప్రకటన.. 6 కొత్త రైల్వే లైన్లు
నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఆరు కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్రం పచ్చజెండా ఊపినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో ప్రకటించారు. ఈ ప్రాజెక్టులతో తెలంగాణలో రైల్వే నెట్‌వర్క్ మరింతగా విస్తరించనుంది. ముఖ్యంగా దూరప్రాంతాలు, వెనుకబడిన జిల్లాలకు మెరుగైన రైల్వే కనెక్టివిటీ అందనుంది.
లోక్‌సభలో అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన
తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్ లోక్‌సభలో ప్రశ్నించగా.. కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానం ఇస్తూ ఈ కీలక ప్రకటన చేశారు. కొత్త రైల్వే లైన్ల కోసం ఇప్పటికే సర్వే ప్రక్రియ కొనసాగుతోందని, డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధమైన తర్వాత టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు.

తెలంగాణలో కొత్తగా నిర్మించనున్న రైల్వే లైన్లు
- కాచిగూడ – జగ్గయ్యపేట
- బోధన్ – లాతూర్
- గద్వాల్ – డోర్నకల్ (కల్వకుర్తి మీదుగా)
- వికారాబాద్ – కృష్ణా
- పటన్ చెర్వు – ఆదిలాబాద్
- అక్కన్నపేట బైపాస్ రైల్వే లైన్
రైల్వే లైన్ల పొడవు వివరాలు
- కాచిగూడ – జగ్గయ్యపేట : 250 కి.మీ
- పటన్ చెర్వు – ఆదిలాబాద్ : 320 కి.మీ
- వికారాబాద్ – కృష్ణా : 122 కి.మీ
- గద్వాల్ – డోర్నకల్ : 316 కి.మీ
- బోధన్ – లాతూర్ : 128 కి.మీ
- అక్కన్నపేట బైపాస్ : 128 కి.మీ
ఇప్పటివరకు తెలంగాణకు మంజూరైన రైల్వే ప్రాజెక్టులు
- 2022–23 నుంచి ఇప్పటివరకు 18 కొత్త రైల్వే లైన్లకు అనుమతి
- మొత్తం 57 రైల్వే లైన్లకు డీపీఆర్ సర్వేలకు ఆమోదం
- మొత్తం 5,665 కిలోమీటర్ల పొడవైన రైల్వే లైన్ల నిర్మాణ లక్ష్యం
- రాష్ట్ర ప్రభుత్వాలతో భాగస్వామ్యంగా డీపీఆర్‌ల తయారీ
భూసేకరణే ప్రధాన అడ్డంకి
తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల కోసం మొత్తం 2,343 హెక్టార్ల భూమి అవసరమని, ఇప్పటివరకు 1,580 హెక్టార్లు మాత్రమే సేకరించామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. భూసేకరణలో జాప్యం కారణంగా నాలుగు ప్రధాన రైల్వే ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు.


