ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా కీలక సందేశం.
నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: శరీరంలో వచ్చే మార్పులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్యాన్సర్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చిరంజీవి స్పష్టం చేశారు.పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ క్యాన్సర్ అనేది దేవుడు ఇచ్చిన శాపం కాదని, మన జీవనశైలిలోని తప్పుల వల్లే వచ్చే వ్యాధి అని అన్నారు. కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి ఈవెంట్‌ను ప్రారంభించిన చిరంజీవి, “క్యాన్సర్ అనగానే జీవితం ముగిసిపోయినట్టే అనుకుంటున్నారు చాలామంది. కానీ ఇక్కడ క్యాన్సర్‌ను జయించి సాధారణ జీవితం గడుపుతున్నవారిని చూస్తుంటే, వైద్యులు ఎంత కష్టపడుతున్నారో తెలుస్తోంది” అన్నారు.
మన జీవన విధానం ఆధారంగానే చాలా వ్యాధులు వస్తాయని, అందుకే ప్రతి ఒక్కరూ జీవనశైలిపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. క్యాన్సర్ అనేది మరణశాసనం కాదని, ముందస్తుగా గుర్తిస్తే క్యాన్సర్‌ను కూడా జయించి సాధారణ జీవితం ఆస్వాదించవచ్చని చెప్పారు. చిన్నారులు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్న పరిస్థితి ఎంతో బాధ కలిగిస్తోందని అన్నారు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో కిమ్స్ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, రోబోటిక్ సర్జన్ డా. మధు దేవరశెట్టి మాట్లాడుతూ గతంలో 40, 50 ఏళ్ల పైబడిన వారిలో మాత్రమే కనిపించిన క్యాన్సర్, ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల్లో కూడా కనిపిస్తోందని తెలిపారు. జన్యుపరమైన లోపాలు, వంశపారంపర్య కారణాలు, రేడియేషన్, రసాయనాలు, ఎరువుల వినియోగం, మద్యం, ధూమపానం, ఒత్తిడి, జీవనశైలి సమస్యలు ఇందుకు కారణాలని వివరించారు.అవగాహన లోపం కారణంగానే చాలామంది చివరి దశలో ఆసుపత్రులకు వస్తున్నారని, క్యాన్సర్‌పై అవగాహన అత్యంత కీలకమని డా. మధు దేవరశెట్టి అన్నారు. ఈ నేపథ్యంలో కిమ్స్ హాస్పిటల్స్‌లో ‘క్యాన్సర్ ఫైట్ సపోర్ట్ గ్రూప్’ను ఏర్పాటు చేశామని తెలిపారు. చికిత్స అనంతరం సాధారణ జీవితం గడుపుతున్న రోగులు సమాజానికి ధైర్యం చెప్పాలన్నదే దీని ప్రధాన లక్ష్యమని చెప్పారు.క్యాన్సర్ చికిత్సలో ప్రస్తుతం అత్యాధునిక సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయని, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే దీర్ఘకాలం జీవించే అవకాశాలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ డైరెక్టర్ డా. సంబిత్ సాహు, మెడికల్ ఆంకాలజిస్ట్ డా. నరేందర్ కుమార్ తోటతో పాటు క్యాన్సర్‌ను జయించిన వారు, ప్రస్తుతం చికిత్స పొందుతున్న రోగులు పాల్గొన్నారు.

