టెస్ట్ రిపోర్ట్ చూసి షాక్.. చివరకు ఆసుపత్రి ఖాళీ చేయాల్సిన పరిస్థితి!
నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: సోషల్ మీడియాలో ఓ షాకింగ్ ఘటన వైరల్‌గా మారింది. తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరిన ఓ యువకుడి కేసు చివరకు ఆసుపత్రి మొత్తాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితికి దారి తీసింది. ఈ ఘటన ఫ్రాన్స్‌లో చోటుచేసుకుంది.ఫ్రాన్స్‌లోని టౌలౌస్ నగరానికి చెందిన 24 ఏళ్ల యువకుడు తీవ్ర కడుపు నొప్పితో స్థానిక ప్రధాన ఆసుపత్రికి చేరాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. నొప్పికి గల కారణాన్ని తెలుసుకునేందుకు స్కానింగ్, ఇతర పరీక్షలు నిర్వహించారు. అయితే రిపోర్టులు చూసిన వైద్యులకు ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగింది.
ఆ యువకుడి శరీరంలో పెద్ద ప్రమాదకర వస్తువు చిక్కుకుపోయి ఉన్నట్లు తేలడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తతకు దారి తీసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆసుపత్రి యాజమాన్యం భద్రతా కారణాలతో మొత్తం ప్రాంగణాన్ని ఖాళీ చేయించింది.పరీక్షల అనంతరం బయటపడిన అసలు విషయం వైద్యులను, అధికారులను సైతం షాక్‌కు గురిచేసింది. ఆ యువకుడి పొత్తికడుపులో మొదటి ప్రపంచ యుద్ధ కాలానికి చెందిన ఫిరంగి షెల్ లోతుగా చిక్కుకుని ఉన్నట్లు గుర్తించారు. 1918 నాటి సుమారు 8 అంగుళాల పొడవున్న లైవ్ బాంబు షెల్ కావడంతో, ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు వెంటనే అత్యవసర చర్యలు చేపట్టారు. యువకుడికి తక్షణమే శస్త్రచికిత్స నిర్వహించగా, అదే సమయంలో బాంబ్ స్క్వాడ్, అగ్నిమాపక విభాగం, భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. ఆసుపత్రి చుట్టూ భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసి, రోగులు, సిబ్బందిని సురక్షితంగా తరలించారు. ఆపరేషన్ సమయంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా అత్యంత జాగ్రత్తలు తీసుకున్నారు.అదృష్టవశాత్తూ, పేలుడు ప్రమాదం తక్కువగా ఉందని అధికారులు నిర్ధారించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. శస్త్రచికిత్స అనంతరం బాంబ్ స్క్వాడ్ బృందం ఆ షెల్‌ను స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఆ యువకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నాడని వైద్యులు తెలిపారు.ఈ ఘటన ఫ్రాన్స్‌లోనే కాదు, సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. వైద్యులు ఎదుర్కొన్న అనూహ్య పరిస్థితి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

