Breaking News

రాను.. రానంటూనే…చిత్రావతి చేరిన కృష్ణమ్మ-అన్నదాతలకు అశాకిరణంగా చిత్రావతి జలాశయం-దశాబ్దాల కాలం తర్వాత నెరవేరిన కల.

పులివెందుల ఫిబ్రవరి 5 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కరువు కాటకాలకు చిరునామాగా మారిన రాయలసీమలో చిత్రావతి ప్రాజెక్టు అన్నదాతలకు ఆశాకిరణంగా నిలుస్తోంది. వర్షం పడితే పండాలి, లేకపోతే ఎండాలి అన్న పరిస్థితుల్లో ఏళ్ల తరబడి జీవించిన పులివెందుల రైతులకు ఇప్పుడు సాగుకు భరోసా లభిస్తోంది. ప్రస్తుతం చిత్రావతి ప్రాజెక్టులో 9 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉండటంతో ఈ ప్రాంతమంతా ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.దశాబ్దాల కాలం తర్వాత ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఎండిపోయిన చెరువులు, బావులు, బోర్లు మళ్లీ నీటితో కళకళలాడుతున్నాయి. దీంతో ఖరీఫ్‌తో పాటు రబీ పంటల సాగుపై రైతుల్లో విశ్వాసం పెరిగింది. వేరుశనగ, వరి, పప్పుదినుసులు, కూరగాయల సాగు, అలాగే ఉద్యాన పంటలకు అనుకూల వాతావరణం ఏర్పడింది. చిత్రావతి నీటితో పులివెందుల నియోజకవర్గం వ్యవసాయంగా మళ్లీ పుంజుకుంటోంది. ఉపాధి అవకాశాలు పెరగడంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపొస్తోంది. రైతులే కాకుండా కూలీలు, వ్యాపారులు కూడా లబ్ధి పొందుతున్నారు. సాగునీటి సమస్య తీరడంతో వలస బాట పట్టిన కుటుంబాలు తిరిగి స్వగ్రామాల వైపు మొగ్గు చూపుతున్నాయి. చిత్రావతి ప్రాజెక్టు ద్వారా కరువు గాయాలకు మెల్లగా మాన్పు లభిస్తోంది. ప్రభుత్వాల చిత్తశుద్ధి, ప్రాజెక్టు నిర్వహణ ఫలితంగా ఇది సాధ్యమైందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో కూడా నీటి వనరుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటే పులివెందుల ప్రాంతం మరింత సస్యశ్యామలం అవుతుందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. కరువుతో కుమిలిపోయిన సీమకు చిత్రావతి నీరు జీవధారగా మారి, అన్నదాతల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది.

చిత్రావతి ప్రాజెక్టుకు నీరు ఇలా..
లింగాల మండలం పార్నపల్లె సమీపంలోని చిత్రావతి ప్రాజెక్టునకు ఎగువ భాగాన ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు నుంచి నీరు చేరుతుంది. ఈ నీరు కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ లోని రాయలసీమ, తెలంగాణ ప్రాంత పరిధిలో ప్రవహించి తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్ ప్రాంతంలో కలుస్తుంది. తుంగభద్ర ప్రాజెక్ట్ నుంచి సుమారు 105 కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని కనేకల్ చెరువు వద్దకు నీరు చేరుతుంది. అక్కడి నుంచి తుంగభద్ర సమాంతర కాలువ ద్వారా పెన్నా అహోబిలం డ్యాం వద్దకు చేరుతుంది. ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు నీటిని తరలిస్తారు. ఈ క్రమంలో పిఏబి డాం నుంచి మిడ్ పెన్నార్ ( పెంచికచర్ల )కు చేరుతుంది. మిడ్ పెన్నార్ నుంచి సత్యసాయి జిల్లా తాడిపత్రి వైపు ప్రవహిస్తుంది. అక్కడి నుంచి కుడి ఎడమ మరో రెండు కాలువల ద్వారా నీరు ప్రవహిస్తుంది. అటు తరువాత తుంపెర డీప్ కట్టు వద్ద చేరుతుంది. అటు నుంచి ఎడమ కాలువ ద్వారా అనంత జిల్లాలోని ఎల్లనూరు, కుడి కాలువ ద్వారా చిత్రావతి ప్రాజెక్టుకు చేరుతుంది. చిత్రావతి ప్రాజెక్టు నుంచి ఏటి ద్వారా గొడ్డుమర్రి ఆనకట్ట చేరుతుంది. ఇక్కడి నుంచి లింగాల మండలం కామసముద్రం చెరువుకు నీరు చేరుతుంది. ఇక్కడి నుంచే పులివెందుల బ్రాంచ్ కెనాల్ ప్రారంభమవుతుంది

4.4 టిఎంసిల నీటి కోట ఏదీ..
తుంగభద్ర ప్రాజెక్టు నుంచి ప్రతిఏటా 4.4 టిఎంసిల నీటి కోటా చిత్రావతికి చేరాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఏనాడు పూర్తిస్థాయి కోటా చిత్రావతికి రాలేదు. చిత్రావతికి నీటి విడుదల విషయమై ప్రతిఏటా అనంతపురంలో సాగునీటి సలహా మండలి ఆధ్వర్యంలో సమావేశము ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశానికి ప్రజా ప్రతినిధులు హాజరై నీటికోటా విషయమై సమావేశంలో వివరిస్తారు. అయితే తుంగభద్ర ప్రాజెక్టులో కూడిక చేరిందన్న సాకుతో ఏటా రెండు టీఎంసీల నీటిని విడుదల చేసేలా సాగునీటి సలహా మండలి సమావేశంలో తీర్మానిస్తారు. కానీ అవి చిత్రావెతికి చేరే సరికి అర టీఎంసీ నీరు మాత్రమే ఉంటుంది. ఈ నీరు కనీసం తాగునీటి అవసరాలకు కూడా ఉపయోగపడలేదు

శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ప్రభుత్వ విప్ శాసన సభ్యురాలు గొంగిడి సునీత.

కృష్ణాజలాల రాకతో మహర్దశ
చిత్రావతికి కృష్ణాజలాలు రావడంతో రైతులకు మహర్దశ కలిగింది. ఒకప్పుడు సాగునీటి సంక్షోభానికి దారి తీసిన పరిస్థితులు చూస్తే బాధిస్తుంది. సాగునీరు లేని పరిస్థితులలో 70 శాతం మంది రైతులు వర్షాధారం పైనే ఆధారపడి పంటలు సాగించారు. సాగునీటి సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో కంటికి రెప్పలా కాపాడుకున్న చీనీ చెట్లు కళ్లెదుటే నిట్ట నిలువునా ఎండిపోయాయి. ఈ దుర్భర పరిస్థితుల్లో కొంతమంది రైతులు ఎండిన చీనీచట్లను బొగ్గులు పట్టీలకు విక్రయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. మరి కొంతమంది రైతులు గొడ్డలికి అని చెప్పి వాటిని వంటచేరుకుగా విక్రయించుకోవడం హృదయ విధానకరం. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు వస్తాడట అన్న చందంగా రైతుల పరిస్థితి మారింది. 2017లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో గండికోట నుంచి చిత్రావతికి కృష్ణా జలాలను తరలించారు. మొదట ఆరు టీఎంసీల సామర్థ్యం ఉన్న చిత్రావతి 10 టీఎంసీల సామర్థ్యానికి పెరిగింది. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పూర్తిస్థాయిలో చిత్రావతి ప్రాజెక్ట్ పరిధిలోని ముంపు వాసులకు పరిహారం చెల్లించడంతో 10 టీఎంసీల సామర్థ్యానికి మార్గం సుగమమైంది. ప్రస్తుతం చిత్రావతిలో 9 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. చిత్రావతిలో నీరు సమృద్ధిగా ఉండడంతో పులివెందుల ప్రాంతంలో చెరువులు నీటి కుంటలు కలగలాడుతున్నాయి. భూగర్భ జలాల నీటిమట్టం కూడా పెరిగినట్లు రైతులు చెబుతున్నారు. ఒకప్పుడు సాగునీటి కోసం రెండు వేల అడుగుల లోతు చేసిన లభించని గంగ ఇప్పుడు 200 అడుగులలోనే లభిస్తోందని రైతులు వెల్లడించారు.

చిత్రావతికి పర్యాటక శోభ
చిత్రావతి ప్రాజెక్టుకు పర్యాటక శోభ సంతరించుకుంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఇక్కడ సుమారు రూ. 6.5 కోట్ల వ్యయంతో పర్యాటక ప్రాంత అభివృద్ధి పనులు జరిగాయి. బోటు ప్రయాణం, చక్కని పార్కులు తదితర ప్రాంతాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. పండుగలు పర్వదినాలు సర్వ దినాలలో పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని ఒక్కసారి చూస్తే మళ్లీ మళ్లీ చూడాలన్నా కోరిక పర్యాటకుల్లో కలుగుతుంది.

చిత్రావతి ప్రాజెక్టు ప్రారంభం
లింగాల మండలం పారేపల్లి సమీపంలో 1988లో చిత్రావతి ప్రాజెక్టు ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది. అయితే ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు కనిపించడంతో మరోసారి ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. 1995లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి, సీఎల్పీ నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి, అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి జీవీ సుధాకర్ రావులు కలిసి పులివెందుల నియోజకవర్గ పరిధిలో 177 గ్రామాలకు తాగునీరు అందించే విధంగా రాజీవ్ గాంధీ టెక్నాలజీ మిషన్ పేరిట శంకుస్థాపన చేశారు. 1999-2000 సంవత్సరం నాటికి చిత్రావతి ప్రాజెక్టు ముగింపు దశకు చేరింది. 2006లో గేట్ల నిర్మాణం పూర్తయింది. చిత్రావతి ప్రాజెక్టునిర్మాణం ఆలస్యమైనా చివరకు రైతుల చిరకాల కోరిక నెరవేరింది.

మహాశివ రాత్రి శీర్షిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *