ఆస్తి పన్ను – నల్లా బిల్లుల పెంపు లేదంటూ ప్రభుత్వం స్పష్టత.
నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఆస్తి పన్ను, నల్లా బిల్లులు పెంచనున్నారనే వార్తలపై ప్రభుత్వం అధికారికంగా క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంలో ఎలాంటి ప్రతిపాదన లేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.కరీంనగర్ మున్సిపాలిటీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు ఈ అంశంపై మాట్లాడారు. ఆస్తి పన్ను, నల్లా బిల్లులు పెంచుతారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క పన్ను కూడా పెంచలేదని ఆయన పేర్కొన్నారు.పన్నుల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆలోచన లేదని మంత్రి తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వమే అనేక రకాల పన్నులు పెంచుతోందని విమర్శించారు. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు.

పన్నులు పెంచకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని శ్రీధర్ బాబు తెలిపారు. రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. గతంలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయని ఆరోపించారు.అలాగే కేంద్ర ప్రభుత్వం అనేక రాష్ట్రాలకు నిధులు విడుదల చేస్తూనే, కరీంనగర్ డంపింగ్ యార్డుకు మాత్రం నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. కరీంనగర్ మేయర్ స్థానాన్ని గెలుచుకున్న తర్వాత నగర అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు.మొత్తంగా చూస్తే ఆస్తి పన్ను, నల్లా బిల్లుల పెంపు ఉంటుందన్న ప్రచారాలకు ఇక ముగింపు పలికినట్టే అని ప్రభుత్వం స్పష్టం చేసింది.

