ఖమ్మం /కొత్తగూడెం: ఫిబ్రవరి6 ( నేటి తెలుగు పత్రిక): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర పాలనా కాలంలో అన్ని విధాలా అభివృద్ధి చెంది రాష్ట్రం దేశంలో అగ్రగామిగా అవతరించిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు.మహానేత కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి ప్రజల 70 ఘోస తీర్చారని, అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా పదేళ్లు సుపరిపాలన అందించారని కొనియాడారు.ఎంపీ రవిచంద్ర శుక్రవారం కొత్తగూడెం 22వ డివిజన్ సుజాతానగర్, 60వ డివిజన్ కూలీ లైన్, 55వ డివిజన్ గణేష్ టెంపుల్ ఏరియా, 58వ డివిజన్ హనుమాన్ బస్తీలలో మునిసిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.సుజాతానగర్ లో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు రాఘవ,మిగతా చోట్ల మునిసిపల్ మాజీ ఛైర్ పర్సన్ సీతామహాలక్ష్మీ తదితర ప్రముఖులతో కలిసి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భాలలో ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ, కేసీఆర్ మార్గ నిర్దేశనం, పురపాలక శాఖ మంత్రిగా పనిచేసిన కే.టీ.రామారావుల సహకారంతో ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెంను ప్రగతిపథాన పరుగులు పెట్టించారన్నారు.సుమారు 3,000 కోట్లు ఖర్చు చేసి కొత్తగూడెం పట్టణాన్ని, నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పర్చారని ఎంపీ రవిచంద్ర చెప్పారు.పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు గాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేశారని ఎంపీ రవిచంద్ర తెలిపారు.మెడికల్, నర్సింగ్ కాలేజీల ఏర్పాటుతో పాటు పాల్వంచలో అధునాతన కలెక్టరేట్ నిర్మించడం జరిగిందని చెప్పారు.సుజాతానగర్ నుంచి లక్ష్మీపురం రోడ్డును వెడల్పు చేసి సెంట్రల్ డివైడర్,వీధి దీపాలు ఏర్పాటు చేశారని, చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రతగా తీర్చిదిద్దారని ఎంపీ వద్దిరాజు వివరించారు.కేసీఆర్ పాలనలో హైదరాబాద్, ఖమ్మం నగరాల మాదిరిగా కొత్తగూడెం ఒక వెలుగు వెలిగిందన్నారు.కేసీఆర్ ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్ధి,సంక్షేమమే తప్ప, ఇప్పుడు రూపాయి పని కూడా జరగడం లేదని,ఈ రెండేళ్లు వెనక్కిపోయిందని, రానున్న మూడేళ్లు ఇంకా నష్టం జరిగే ప్రమాదం ఉందని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సాధించడమే కాక అన్ని రంగాలలో గొప్పగా అభివృద్ధి చేసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పెంపొందించిన మహనీయులు కేసీఆర్ ముఖం చూసి కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ కు ఘన విజయం చేకూర్చాల్సిందిగా ఎంపీ వద్దిరాజు కోరారు.ఈ సందర్భంగా “జై తెలంగాణ జైజై తెలంగాణ”,”జిందాబాద్ జిందాబాద్ బీఆర్ఎస్ జిందాబాద్”,”వర్థిల్లాలి వర్థిల్లాలి కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాలి”,”కారు గుర్తుకే మన ఓటు”,”గెలిపిద్దాం గెలిపిద్దాం కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిద్దాం”అనే నినాదాలు మిన్నంటాయి.


