కోదాడ, ఫిబ్రవరి6( నేటి తెలుగు పత్రిక): శ్రమ శక్తి నీతి పేరుతో దేశ కార్మిక వర్గ శ్రమశక్తిని కారు చౌకగా పెట్టుబడుదారులకు, కార్పొరేట్లకు, మల్టీనేషన్ కంపెనీలు కొల్లగొట్టడానికి మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను రూపొందించారని ఇది కార్మిక వర్గానికి తీవ్ర వ్యతిరేకమైనవని ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి వి నర్సింహ రావు అన్నారు. స్థానిక లాల్ బంగ్లాలో సమ్మె పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వి నర్సింహ రావు పాల్గొని మాట్లాడుతు 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడులుగా కుదించి కార్మిక హక్కులను హరించే విధంగా మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని అన్నారు. బిజెపి ప్రభుత్వానికి లేబర్ కోడ్ లు తప్ప కార్మిక చట్టాలు ఇష్టం ఉండదని అన్నారు. లేబర్ కోడ్ లలో రాసిన ప్రకటిత అంశాలు ఎలా ఉన్నా సారాంశంలో ఒక వర్గానికి మరో వర్గం కట్టుబడి ఉండాలని బిజెపి కోరుకుంటుందని ఇవే అంశాలు దీనిలో పొందుపరిచారని ఆన్నారు. కోడ్ ల వలన కార్మికుల బతుకులు ఉజ్వలంగా ఉంటున్నాయని, ఆత్మ నిర్బర్ లో భాగంగా కొత్త హక్కులు కల్పిస్తున్నామని చెప్పడం పచ్చి బూటకమని, చట్టాల స్థానంలో కోడ్ లు తేవడం అంటే కార్మికుల చేతులకు సంకెళ్లు వేయడమేనని అన్నారు. కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకోవడం యాజమాన్యాలతో బేర సారలు చేసుకోవడం, సమ్మె చేసుకునే హక్కు, పని గంటలు పెంచి కార్మిక వర్గంపై భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 15 వేలు వేతనం పొందే కార్మికులు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే కార్మికులు కార్మికులుగా గుర్తించబడని అన్యాయం అన్నారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, స్కీమ్ వర్కర్ల ను ఉద్యోగులుగా ట్రీట్ చేస్తూ కార్మిక చట్టాలు వీరికి వర్తించకుండా దూరం చేయనున్నారని విమర్శించారు. కార్మికులు ఎన్నో ఏళ్ల నుండి పోరాటం చేసి సాధించుకున్న హక్కులను ,చట్టాలను కాలరాస్తున్నారని లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ జిల్లా అధ్యక్షులు ఉదయగిరి, ఐ ఎఫ్ టీ యూ నాయకులు, కార్మికులు పారేల్లి నాగయ్య, డి రవి, సత్యనారాయణ రెడ్డి, విజయ్, వీరబాబు, రవి తేజ, ఖాసీం నర్సింహ రావు, త్రినేష్, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.
