Breaking News

🔥 బుజ్జగింపు రాజకీయాలతో బీసీలకు అన్యాయం.. మత రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసిన కిషన్ రెడ్డి

నేటి తెలుగు పత్రిక: మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్‌లో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం తెలంగాణలో సామాజిక సమతుల్యతను దెబ్బతీస్తోందని ఆరోపించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మత ఆధారిత రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలు ప్రమాదకరమని వ్యాఖ్యానించిన కిషన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బుజ్జగింపు రాజకీయాలకు పరాకాష్టగా వ్యవహరిస్తోందన్నారు. ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలతో కూడిన ప్రకటన విడుదల చేశారు.కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ కంటే ముందుకెళ్లి మతతత్వ రాజకీయాలు చేస్తోందన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు తెలంగాణ కాంగ్రెస్ పూర్తి నిదర్శనమని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ‘‘ముస్లిం లీగ్ కాంగ్రెస్’’ అన్న పేరు రాష్ట్ర కాంగ్రెస్‌కు అచ్చుగా సరిపోతుందని అన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మత ప్రాతిపదికన ప్రవేశపెట్టిన 4% రిజర్వేషన్లను హైకోర్టు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు స్టే పేరుతో వాటిని కొనసాగించిందని గుర్తు చేశారు. ఇప్పుడు అదే విధానాన్ని తెలంగాణలో మరింత విస్తరించే ప్రయత్నం జరుగుతోందని ఆయన ఆరోపించారు.

పాషా బాయ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే గడ్డం వినోద్

కాంగ్రెస్ అసలు లక్ష్యం ముస్లింలకు మొత్తం 14% రిజర్వేషన్లు కల్పించడమేనని కిషన్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉన్న 4%కి అదనంగా బీసీ కేటగిరీలో చేర్చి మరో 10% రిజర్వేషన్ ఇవ్వాలనే వ్యూహంతో కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు.కులగణన ముసుగులో బీసీ జనాభాను కావాలనే వక్రీకరించారని, వాస్తవంగా 46% ఉన్న బీసీలను 56%గా చూపించి అందులో 10% ముస్లింలను కలిపారని విమర్శించారు. దీని వల్ల బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లు తగ్గిపోయాయని తెలిపారు.2020 జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలే ఈ బుజ్జగింపు రాజకీయాలకు సాక్ష్యమని పేర్కొన్న కిషన్ రెడ్డి, బీసీల కోసం కేటాయించిన సీట్లలో మెజారిటీ నాన్-బీసీల చేతికి వెళ్లాయని గుర్తు చేశారు. దీని వల్ల నిజమైన వెనుకబడిన వర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.బీసీ సమాజం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోందని, సరైన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెబుతుందని కిషన్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ భవిష్యత్తును కాపాడాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాల్సిందేనని పిలుపునిచ్చారు.

పెన్షనర్ల హక్కులకై పోరాటo

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *