పులివెందుల ఫిబ్రవరి 9 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తుల విశ్వాసాలపై వైసీపీ ప్రభుత్వం చేసిన దాడి అత్యంత దారుణమైన ఘటనగా చరిత్రలో నిలుస్తుందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూబ్రిటిష్ పాలకులు కూడా వెంకటేశ్వర స్వామి జోలికి రాలేదని, కానీ వైసీపీ పాలనలో మాత్రం దేవుడి ప్రసాదానికే కల్తీ చేసే స్థాయికి దిగజారారని ఆయన విమర్శించారు. ఇది కేవలం అవినీతి కాదు, కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన మహా పాపమని అన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో దాదాపు 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి ఉపయోగించి 20 కోట్లకు పైగా శ్రీలడ్డూలు తయారు చేసి భక్తులకు పంపిణీ చేసినట్టు సిబిఐ సిట్ చార్జిషీట్‌లో స్పష్టంగా నమోదైందని తెలిపారు. ఆవు నెయ్యి బదులు మోనోగ్లిసరైడ్స్, బీటా కెరటిన్, ఎసిటిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్ వంటి హానికరమైన రసాయన పదార్థాలను ఉపయోగించడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల సిఫారసులతో టీటీడీ టెండర్ నిబంధనలను అక్రమాలకు అనుకూలంగా మార్చారని, అర్హత లేని కంపెనీలకు టెండర్లు కట్టబెట్టేందుకు అనుభవం, ఉత్పత్తి సామర్థ్యం, ఎఫ్ ఎస్ ఏ ఐ అనుమతుల వంటి కీలక నిబంధనలను కావాలనే సడలించారని అన్నారు. ఈ మార్పులన్నీ సిబిఐ–సిట్ చార్జిషీట్‌లో స్పష్టంగా ఉన్నాయని గుర్తు చేశారు.
2022లో వచ్చిన ఎన్ సి ఆర్ టి ఐ నివేదిక, అలాగే ఎన్ డి డి వి నివేదికలు నెయ్యిలో జంతు కొవ్వు కలిసినట్టు శాస్త్రీయంగా నిర్ధారించాయని, అయినా వైసీపీ ప్రభుత్వం ఈ నివేదికలను తొక్కిపెట్టిందని ఆరోపించారు. ఈ మొత్తం కుంభకోణంలో దాదాపు రూ.235 కోట్ల స్వామివారి నిధులు దుర్వినియోగం అయ్యాయని, ఇది భక్తుల విశ్వాసంపై జరిగిన అత్యంత ఘోర దాడిగా అభివర్ణించారు. నెయ్యిలో కల్తీ జరిగిందని వైవీ సుబ్బారెడ్డి స్వయంగా ఒప్పుకున్నప్పటికీ ఇంకా వైసీపీ నేతలు బుకాయిస్తుండటం దురదృష్టకరమన్నారు. జగన్ నిజంగా నిర్దోషి అయితే ఈ అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఎందుకని ప్రశ్నించారు. అసలు దోషులను ప్రజల ముందుకు, చట్టం ముందుకు తీసుకొచ్చే వరకు కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో దేవుడి పేరుతో ఎవ్వరూ ఇలాంటి నీచమైన పనులు చేయకుండా ఈ కేసును దేశానికి ఉదాహరణగా మార్చుతామని తెలిపారు.
