పులివెందుల ఫిబ్రవరి 13 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): ఫిబ్రవరి అనగానే ఠక్కున ప్రేమికుల రోజు గుర్తొచ్చేస్తుంది. అదీగాక ఆ నెలంతా కూడా హగ్ డే, కిస్ డే వంటివి వచ్చి.. చివరికి ప్రేమికుల రోజుతో ముగుస్తుంది. రొమాంటిక్ భావనను కలుగజేసే ఆ నెలలో ఉండే సందడి అంత ఇంత కాదు. ప్రేమికులు, వివిధ ప్రేమలు సినిమాలు, టీవీల పుణ్యమా అని వాటి గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతున్నాం. కానీ వేల ఏళ్ల చరిత్ర కాలంలోనే హృదయాల్ని కదిలించే అందమైన ప్రేమ కథలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14 న జరుపుకుంటారు. అమెరికా, కెనడా, మెక్సికో, యునైటేడ్ కింగ్ డమ్, ఆస్ట్రేలియా, భారత్, ఇటలీ, డెన్మార్క్, జపాన్లలో ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. పాశ్చాత్య దేశాల ప్రభావంగా భావించే వాలెంటైన్స్ డే వేడుకలు భారతదేశంలో వ్యతిరేకిస్తున్నారు. దాదాపు ప్రతి సంవత్సరం, నిరసనల కారణంగా భారతదేశంలోని అనేక నగరాల్లో ఫిబ్రవరి 14న శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి.
చరిత్ర:
వాలెంటైన్ అనే ఒక ప్రవక్త. ప్రేమికుల రోజు పుట్టడానికి ఆద్యుడు. సా.శ.పూ. 270లో రోమ్ దేశంలో జీవించిన వాలెంటైన్ యువతకు ప్రేమ సందేశాలు ఇవ్వడం, ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం చేసేవాడు. అదే సమయంలో రోము పాలిస్తున్న చక్రవర్తి క్లాడియస్ కుమార్తె వాలెంటైన్ అభిమానిగా మారడంతో చక్రవర్తికి భయం పట్టుకుంది. దీంతో యువతకు ప్రేమ సందేశాలిచ్చి తప్పుడు దోవ చూపిస్తున్నాడన్న నెపంతో వాలెంటైన్కు మరణశిక్ష విధించి ఫిబ్రవరి 14న ఉరి తీయించాడు. ఈ ఘటన జరిగిన రెండు దశాబ్దాల తర్వాత అప్పటి పోప్ గెలాసియన్స్ వాలెంటైన్ మరణించిన రోజును ప్రేమికుల రోజుగా ప్రకటించారు. అప్పటినుంచి ఖండాంతరాలను దాటుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు పండుగగా జరుపుకునేలా ప్రేమికుల దినోత్సవం విస్తరించింది. ఏటా ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమికులు తమకిష్టమైన కానుకలు ఇచ్చు పుచ్చుకుంటారు.
చారిత్రక మూలాలు:
మూడవ శతాబ్దంలో రోమ్ చక్రవర్తి క్లాడియస్ సైనికులు పెళ్లి చేసుకుంటే బలహీనపడతారని భావించి ప్రేమ వివాహాలను నిషేధించాడు. కానీ, వాలెంటైన్ అనే వ్యక్తి దీనిని ఎదిరించి ప్రేమికులకు వివాహాలు జరిపించాడు. వాలెంటైన్ ప్రేమ కోసం ప్రాణత్యాగం చేశాడు, అందుకే ఫిబ్రవరి 14వ తేదీని అతని జ్ఞాపకార్థంగా ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 14వ శతాబ్దం నుండి, ముఖ్యంగా కవి జియోఫ్రీ చౌసెర్ కాలం నుండి, ఈ రోజును శృంగారంతో, ప్రేమికుల కానుకలతో అనుసంధానించడం ప్రారంభమైంది.
వేడుకల తీరు:
ప్రేమికులు, భార్యాభర్తలు, స్నేహితులు ఒకరికొకరు ప్రేమ సందేశాలు, గులాబీలు, చాక్లెట్లు, బహుమతులు ఇచ్చుకుంటారు. ఇది కేవలం శృంగార ప్రేమకే కాకుండా, స్నేహం ఇతర ఆప్యాయత బంధాలను కూడా జరుపుకునే రోజని చాలామంది భావిస్తారు.
