రైతులకురాయితీపై బిందు, తుంపర సేద్య పరికరాలు అందజేత.
అన్నదాతలు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ.
ఎ. కొండూరు ఫిబ్రవరి 18 (నేటి తెలుగు పత్రిక): సూక్ష్మ సేద్యంతో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగుచేయడం ద్వారా, అధిక దిగుబడులు సాధించడం వంటి బహుళ ప్రయోజనాలు ఉంటాయని.. ఈ నేపథ్యంలో అన్నదాతలు ప్రభుత్వం అందిస్తున్న సూక్ష్మ సేద్య పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.కలెక్టర్ లక్ష్మీశ బుధవారం తిరువూరు ఆర్‌డీవో కె.మాధురి, అధికారులతో కలిసి ఎ.కొండూరు మండలం, రేపూడి గ్రామ పంట పొలాలను సందర్శించారు. సూక్ష్మ సేద్యం పథకం ద్వారా ప్రయోజనం పొందు తున్నరైతు జి.విష్ణువర్ధన్‌రెడ్డి సాగుచేస్తున్న మొక్కజొన్న పంటను, పరికరాలను పరిశీలించారు. పథకం ప్రయోజనాలపై రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ వ్యవసాయ, ఉద్యాన పంటల సాగులో సాగునీటి యాజమాన్యం చాలా ప్రధానమైనదని.. సాగునీటి వనరుల సద్వినియోగంలో బిందు సేద్యం, తుంపర సేద్యం చాలా కీలకమైనవన్నారు. 2025-26లో 2,200 హెక్టార్లకు రాయితీపై బిందు, తుంపర సేద్య పరికరాలను అందించాలనే లక్ష్యంతో జిల్లాలో ఏపీ మైక్రో ఇరిగేషన్ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు.
ఈ లక్ష్యానికి మించి కూడా 3,500 హెక్టార్ల వరకు రైతులకు ప్రయోజనం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఏడు కంపెనీల ద్వారా పరికరాలు అమర్చుతున్నట్లు వివరించారు. సాగునీరు, కరెంటు వినియోగంలో 50 శాతం పొదుపుతో పాటు ఉన్న నీటితో ఎక్కువ విస్తీర్ణానికి నీరు అందించడం సూక్ష్మ సేద్యంతో సాధ్యమవుతుందని.. భూసారానికి, భూ సమతుల్యతకు ఎలాంటి హానీ కలగకుండా సాగువ్యయంలో దాదాపు 40 శాతాన్ని ఈ విధానంతో ఆదా చేసుకోవచ్చన్నారు. మామిడి, జామ, నిమ్మ, అరటి, బొప్పాయి, కొబ్బరి వంటి పంటలతో పాటు కూరగాయలు, పూల తోటలకు కూడా సూక్ష్మ సేద్యం బాగుంటుందన్నారు. సూక్ష్మ సేద్యం వల్ల ఎకరా మొక్కజొన్నకు దాదాపు ఏడు క్వింటాళ్ల మేర అదనపు దిగుబడి వస్తుందన్నారు. ఆయిల్‌పామ్‌లో అంతరపంటగా మొక్కజొన్న సాగుకు ప్రయోజనకారిగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో రైతు సేవా కేంద్రాలు, ఏపీ ఎంఐపీ కార్యాలయం ద్వారా వివరాలు పొంది, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అవసరం మేరకు శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. వ్యవసాయ, ఉద్యాన రంగాల స్థూల జోడింపు విలువ (జీవీఏ)లో వృద్ధికి సూక్ష్మ సేద్యం విధానాలు కూడా ఉపయోగపడతాయని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఐపీ పీడీ పి.ఎం.సుభాని, ఉద్యానశాఖ అధికారి నరేంద్ర కుమార్, వ్యవసాయ శాఖ ఏడీఎ రంగారావు, సూక్ష్మ సేద్య పథకం జిల్లా కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

