విజయవాడ,Mar07,నేటి తెలుగు పత్రిక: రాష్ట్రంలో ప్రసిద్ధ దేవాలయాలతో, కోట్లాది రూపాయల విలువైన ఆస్తులున్న దేవాదాయ శాఖకు నిబద్ధతతో వ్యవహరించే ఐఏఎస్ ర్యాంకు గల కమిషనర్ వెంటనే నియమించాలని కాపు పొలిటికల్ జేఏసీ చైర్మన్ వేల్పూరి శ్రీనివాసరావు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు కావస్తున్న పూర్తిస్థాయిలో ఐఏఎస్ కమిషనర్ ను నియమించకపోవడం శోచనీయమన్నారు. దేవాదాయ శాఖకు ఇన్చార్జి కమిషనర్ గా రామచంద్ర మోహన్ కు పోస్టింగ్ ఇవ్వడం పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అదనపు కమిషనర్ హోదాలో పనిచేస్తున్న రామచంద్ర మోహన్ కమిషనర్ పదవికి అర్హుడు కాదన్నారు.. పైగా సింహాచలం దేవస్థానం ఈవోగా పనిచేసిన సమయంలో దేవస్థాన భూములను అక్రమంగా రికార్డు నుంచి తొలగించి అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణలపై గత ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక అధికారిని తీసుకువచ్చి ఆ ప్రతిష్టాత్మకమైన దేవాదాయ శాఖ కమిషనర్ గా నియమించడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఐఏఎస్ ఎవరూ లేరా ?. ఐఏఎస్ అర్హత లేనీ అధికారిని కమిషనర్ గా నియమించడం అంటే కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీయటమేనని ఆరోపించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అత్యున్నత అధికారి కమిషనర్ రామచంద్ర మోహన్ ను నియమించడం వలన క్రింది స్థాయి అధికారులు కూడా అవినీతికి పాల్పడే ప్రమాదం ఉందన్నారు. ఉన్నతాధికారి ఖచ్చితత్వంతో పని చేస్తే కింది స్థాయి అధికారులు కూడా క్రమశిక్షణతో పని చేస్తారని తెలిపారు. పై అధికారి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటు కింది స్తాయి అధికారులు విచ్చలవిడితనంతో చెలరేగి పోతారని, ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియని విషయం ఏమీ కాదని హితవు పలికారు. ఇన్చార్జి కమిషనర్ రామచంద్ర మోహన్ మీద వచ్చిన అవినీతి ఆరోపణలను తక్షణమే విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. వేల కోట్ల రూపాయలు విలువైన దేవాలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు. చందనోత్సవం సందర్భంగా సింహాచలం దేవస్థాన ఆలయ ప్రాంగణంలో గోడ కూలి ఆరుగురు మరణిస్తే, విచారణ జరిపి ఈఓ ను సస్పెండ్ చేశారు కానీ ఇంచార్జ్ కమిషనర్ రామచంద్ర మోహన్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఇది పక్షపాత ధోరణిని వెల్లడిస్తుందన్నారు.దేవాలయ భూములను వ్యాపార సంస్థలకు కట్టబెట్టడం సహేతుకం కాదన్నారు. అవినీతి ,అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని, వారి నుంచి దేవాలయలు కోల్పోయిన ఆస్తులను, సొమ్ములను తిరిగి రికవరీ చేయాలని డిమాండ్ చేశారు.
